Sep 15,2023 23:00

ప్రజాశక్తి-అమలాపురం
బాలబాలికలు ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణించి, జిల్లా ప్రతిష్టను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింప జేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు. శుక్రవారం రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఉన్న డిగ్రీ కళాశాల ఇండోర్‌ స్టేడియం నందు దెందుకూరి సత్యనారాయణ రాజు మెమోరియల్‌ రాష్ట్రస్థాయి అండర్‌ 11 బాల బాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ -2023 పోటీలకు సంబంధించి క్రీడాజ్యోతి ర్యాలీని జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఒత్తిడిని తొలగించడానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. అదే విధంగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న బాలబాలికలను వారి తల్లిదండ్రులు గురువులు అన్ని విధాలుగా ప్రోత్స హించి ప్రతిభను చాటుకునేందుకు నూతనంగా ఏర్పడిన డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పలు వేదికలను ఇప్పటికే నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో నూతనం గా ఏర్పడిన కోనసీమ జిల్లాలో మరింత పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. క్రీడా రంగాలలో ఆసక్తి కలిగిన బాలబాలికలు తమ ప్రతిభను చాటుకుని ఎంచుకున్న గోల్స్‌ ను చేరుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఆ దిశగా ఈ వేదికలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ క్రీడా పోటీలలో ఉమ్మడి 13 జిల్లాలు కు చెందిన అండర్‌ -11 బాల బాలికలు పాల్గొన్నారన్నారు స్థానిక శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ బాలబాలికలు చిన్ననాటి నుండే క్రీడల పట్ల క్రీడా స్ఫూర్తిని చాటుకునే దిశగా పలు వేదికలు జిల్లాలో ఏర్పా టు చేయడం జరుగుతోందని వీటిని సద్వినియోగపరుచుకుని తల్లిదండ్రులకు గురువులకు ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని కోరారు.
ఈకార్యక్రమాలలో క్రీడా పోటీల నిర్వహణ కార్యదర్శి దెందుకూరి రాంబాబు రాజు, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కార్యదర్శి అంకమ్మ చౌదరి, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి బాల సుబ్రమణ్యం, మాధవ్‌ వర్మతదితరులు పాల్గొన్నారు.