ప్రజాశక్తి-యంత్రాంగం
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన తెలిపారు.
మండపేట నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో స్థానిక కపిలేశ్వరపురం రోడ్డులోని ఎంఎల్‌ఎ ఇంటి ముందు బయట ఇచ్చిన ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు పట్టణ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంఎల్‌ఎ వేగుళ్ళతో పాటు మరో 21 మంది టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలవపువ్వు సెంటర్ తదితరచోట్ల పోలీసులు మోహరించారు. టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బంద్ పాటించాలని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుతో సిఎం జగన్ పతనం ఆరంమైందని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. జగన్ పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మచ్చలేని రాజకీయ జీవితం గడిపారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ సైకో పాలనను అంతం చేసి ఆయనకు గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈయన వెంట టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు వున్నారు.రావులపాలెం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఆర్‌టిసి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఎక్కడికి అక్కడ డిపోలలో బస్సులను పక్కన పెట్టేశారు. అన్ని డిపోల్లోను ఇదే పరిస్థితి ఎదురవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా బస్సులను నిలిపివేయడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రావులపాలెంలో జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు చిలువూరు సతీష్ రాజుతో పాటు రావులపాలెం మండల టిడిపి అధ్యక్షుడు గుత్తుల పట్టాభి రామారావు, రాష్ట్ర బిసి సెల్ అధికార ప్రతినిధి కేతా శ్రీను, నాయకులను అరెస్టు చేసి రావులపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆలమూరు చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, ప్రముఖ లాయర్ కె.సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుని విడుదల చేసేంతవరకు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని మండల కేంద్రం ఆలమూరులో ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయినవిల్లి : చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా ముక్తేశ్వరం కూడలిలోనూ, ఏటిగట్టు ప్రాంతాలలో గల అంబేడ్కర్ విగ్రహాల వద్ద టిడిపి శ్రేణులు నిరసన ప్రదర్శన చేశారు. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని చేసారు. మండలంలోని పలువురు టిడిపి నాయకులను స్థానిక పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ అద్యక్షుడు బి. భాస్కర్ జోగేష్, కె.సుబ్బరాజు,ఎస్.సత్తిబాబురాజు,పి.రమేష్,ఎస్.పుల్లయ్యనాయుడు, కె.బాబ్జీ,జి.వెంకటేశ్వరరావు, వి.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఐ.పోలవరం చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడంతో శనివారం టిడిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మురమళ్ళ, పాతఇంజరం స్వగృహంలో ఉన్న మాజీ ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు, చెల్లి వివేకానంద ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డు కున్నారు. మురమళ్ళ సెంటర్లో టిడిపి కార్యకర్తలు, నాయకులు నల్ల రిబ్బన్లు పెట్టుకుని రోడ్డుల పై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఎక్కడి కూడా అల్లర్లు జరకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. యానాం -ఎదుర్లంక వారధి వద్ద వాహనాలను తనిఖీలు నిర్వహించారు.కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రపురం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కె.గంగవరం మండలంలో టిడిపి నాయకులు అభిమానులు బస్టాండ్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు మేడిశెట్టి రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు బలుసు శివప్రసాద్, మండల నాయకులు సలాది రమేష్, కె.మొరార్జీ, గన్ని శ్రీను, మాజీ ఎంపిటిసి సభ్యుడు రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ కె.గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు అమలాపురం రూరల్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయమని రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి పరమట శ్యాం కుమార్ ఖండించారు. శనివారం అమలాపురం పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామికం అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ వద్దకు వెళ్లాలంటూ పట్టుబట్టారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్యాం కుమార్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. తనను లోకేష్ వద్దకు పంపాలంటూ అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. ఆత్రేయపురం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మండల కేంద్రం ఆత్రేయపురం రావి చెట్టు సెంటర్లో మండల టిడిపి అధ్యక్షులు ముదునూరు వెంకటరాజు ఆధ్వర్యంలో మండలం, గ్రామాల నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఆర్‌టిసి అధికారులు బస్సులను డిపోలకే పరిమితం చేయవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రైవేటు వాహనాలు సైతం లేకపోవడంతో వారికి అవస్థలు తప్పలేదు. మామిడికుదురు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మామిడికుదురు మండలంలో216వ జాతీయ రహదారిపై టిడిపి నాయకులు, అభిమానులు శనివారం ధర్నా నిర్వహించారు.. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు. కార్యక్రమంలో బోనం బాబు, చుట్ట గుల్ల కిశోర్, బందేల పద్మ, మహిళా సర్పెంచ్‌లు, పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాట్రేనికోన చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టిడిసి నాయకులు, కార్యకర్తలు శనివారం కాట్రేనికోన గేట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసనను తెలియజేశారు. వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు నిరసన కారులకు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, సర్పంచ్లు చెల్లి సురేష్, దంతులూరి సీతారామకష్ణంరాజు, గోకకొండ గౌరీ సుబ్బలక్ష్మి, విత్తనాల వెంకటరమణ, విత్తనాల బుజ్జి, దండుప్రోలు సత్యం, సుధీర్, కోటిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మాజీ జెడ్‌పిటిసి సభ్యులు నాగిని నాగేశ్వరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమలాపురం మాజీ ఎంఎల్‌ఎ అయితా బత్తుల ఆనందరావు, నాయకులు మెట్ల రమణబాబు సహా మొత్తం 26 మందిని పోలీసు వాహనంలో కాట్రేనికోన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఎస్‌ఐ టి.శ్రీనివాస ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. అమలాపురం చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ అమలాపురంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు నిరసనకు దిగారు. పార్టీ నాయకులు గంటి హరీష్ మాధుర్ ను, మెట్ల రమణ బాబు, మాజీ ఎంఎల్‌ఎ ఆనందరావు, పరమను వారి నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అల్లవరం మండల టిడిపి అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజును హౌస్ అరెస్ట్ చేశారు. రు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమలాపురం డిపో నుంచి బస్సులను తాత్కాలికంగా ఆర్‌టిసి అధికారులు నిలిపివేశారు. ప్రధాన కూ డళ్ళు లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలు సమీక్షించారు. ఉప్పలగుప్తం చంద్రబాబు అరెస్టు సందర్భంగా శనివారం గొల్లవిల్లి లో టిడిపి మండల అధ్యక్షుడు అరిగెల నానాజీని ఆయన ఇంటి వద్ద ఎస్‌ఐజి.వెంకటేశ్వరరావు హౌస్ అరెస్ట్ చేశారు.చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గొల్లవిల్లి, భీమనపల్లి సెంటర్ లలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. భీమనపల్లిలో టిడిపి నాయకులు కొంతసేపు ఆందోళన చేశారు. గోపవరంలో మాజీ ఎంపి బుచ్చిమహేశ్వరరావు తన ఇంటి వద్ద నల్లబ్యాడ్జి ధరించి నిరసన చేపట్టారు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ పికెట్‌లు నిర్వహించారు.










