- వినూత్న అవగాహనలో హైవే అధికారులు.
ప్రజాశక్తి - ఆలమూరు : ఇటీవల కాలంలో వ్యక్తిగత భద్రత పాటించకుండా వాహన ప్రయాణాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇందులో కొందరు బాలలు, యువకులు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు మానసిక రోధనను మిగిల్చుతున్నారు. మరికొందరు కుటుంబ పెద్దలు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకొని కుటుంబాలను అనాధలను చేసి వెళ్తున్నారు. ఇలాంటి వ్యధల నుండి రక్షణకు ప్రతి ద్విచక్ర వాహదారుడు హెల్మెట్ ధరించడం విధిగా చేయాలని, అలాగే కార్లో వెళ్లేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, అలా చేస్తే నేనే వస్తానంటూ హైవే అధికారులు వినూత్నంగా ఏర్పాటు చేసిన యముని వేసాధారుణుడు అంటూ అందర్నీ ఆకట్టుకున్నారు. వివరాలు లోనికి వెళితే తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుండి కోనసీమ జిల్లా గోపాలపురం వరకు గల 216ఏ జాతీయ రహదారిపై పూర్తి ప్రమాదాల నివారణ కొరకు "జీరో ప్రమాదాలు" కార్యక్రమం ఎన్ హెచ్ ఆర్ఇ అప్పలనాయుడు, టోల్ మేనేజర్ కేవిఎస్ఏన్ రెడ్డి, ప్లాజా మేనేజర్ నెహేమియా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా యమధర్మరాజు వేషధారణీతో జాతీయ రహదారుల నిబంధనలు అతిక్రమించి ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పించి వీటి వలన కలిగే దుష్ఫలితాలను వివరించారు. ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకోకుండా నిబంధనలు పాటించి వాహనాలు నడిపి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వారు సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హైవే అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ అధికారి సురేష్, హెచ్ఓ యూ.రవితేజ, ఐఎమ్ మేనేజర్ విజయ్, ఆఫీసర్ రమేష్ , సేఫ్టీ మేనేజర్ రాజా, హెచ్ఆర్ రమేష్, స్థానిక పోలీస్ శాఖ పాల్గొన్నారు.










