Jul 17,2023 15:12

ప్రజాశక్తి మండపేట : డెంగ్యూ, మలేరియా రహిత పట్టణంగా మండపేటను తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దోమలు పెరుగుదలను అరికడదాం, దోమలు పెరుగుదల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా కాపాడుకుందాం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇళ్ళు, పరిసర ప్రాంతాల్లో నీరు నిలవల్లేకుండా చూసుకోవాలన్నారు. ఇంట్లో ఉన్న నీటి నిల్వలను తక్షణమే ఖాళీ చేయాలని వాటర్ డ్రమ్స్, ఫ్రిడ్జ్ బాక్స్, రుబ్రోలు, ఖాళీ బొండాలు, పాత టైర్లు, మొక్కల కింద ప్లేట్లు, డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, టాటా గ్లూకోజ్ కప్పులు, ఐస్ క్రీమ్ కప్పులు, వాటర్ గ్లాసెస్, కూలర్లు, ఇంటి సందుల్లో పడవేసిన పాత సామాన్లు ఇలా దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలను తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. మన కుటుంబాన్ని కాపాడుకుందాం అన్నారు. ఈ స్టిక్కర్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికి అంటించి గృహ, ఖాళీ స్థల వినియోగదారులకు అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ లావణ్య, సచివాలయ సిబ్బంది  గుమ్మడి సుధీర్ కుమార్, దుర్గా శేఖర్, శానిటరీ మేస్త్రి పాలపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు