ప్రజాశక్తి-అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వేను అత్యంత పారదర్శకంగా చేపట్టి నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సర్వే సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి మూడు డివిజనల్ అధికారులు, 22 మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ సర్వే ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైయస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై పంట కాలువల్లో తూడు, పూడికల తొలగింపు, పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల గ్రాస్ ఎన్‌రోల్మెంట్ రేషియో అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వే లో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్, విలేజ్ సర్వేయర్ లాగిన్‌లో డేటా ఎంట్రీ, విఆర్‌ఒ లాగిన్‌లో డేటా ఎంట్రీ డ్రాఫ్ట్ ఫైనల్ ఆర్‌ఒఆర్ తహశీల్దారు లాగిన్‌లో డేటా ఎంట్రీ స్టోన్ ప్లాంటేషన్ భూ హక్కు పత్రాలు పంపిణీ వంటి ప్రక్రియలు సమాంతరంగా చేపట్టి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. మండలాల వారీగా పారామీటర్ల వారి నిర్ధేశించిన అంశాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. పురోగతిలో వెనుకంజలో ఉన్న అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మరింత శ్రమించాలని సూచించారు. రానున్న వారాంతానికి నిర్ధేశిత లక్ష్యాలు అన్నింటినీ చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కాలువ చివరి భూములకు సాగునీరు సవ్యంగా పారేలా ఎంపిడిఒలు జలవనుల శాఖ అధికారులు కాలువలలో తూడు పూడికతీత పనులు టెండర్లు నామినేషన్ పద్ధతిలో పనులు గుత్తేదారులకు అప్పగించినట్టు చెప్పారు. పూడికతీత పనులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. కౌలుదారు రైతులకు పంట రుణ అర్హత కార్డులు లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మేర పెంచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్.సత్తిబాబు, సిపిఒ వెంకటేశ్వర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి ప్రభాకర్, ఎస్‌ఇ కె.చంటిబాబు, ఎ.బోసు బాబు పాల్గొన్నారు.










