పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐవి
ప్రజాశక్తి-ముమ్మిడివరం
ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు, అధికారులు వేధింపులు చేయడం చాలా దారుణమని పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆశా వర్కర్ల సమస్యలపై ఎపి ఆశ వర్కర్ యూనియన్ (సిఐటియు) ఇచ్చిన రాష్ట్ర పిలుపుమేరకు మంగళవారం ముమ్మిడివరం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ఆశా వర్కర్లు పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యఅతిథిగా పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐవి పాల్గొని వారు మాట్లాడుతూ శాసన మండలిలో ఆశ వర్కర్ల సమస్యలపై మాట్లాడుతుంటే వైసిసి ఎంఎల్‌సిలు, టిడిపి ఎంఎల్‌సిలు గానీ ఎవ్వరు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరందరూ ఎంపిటిసి సభ్యులకు, సర్పంచులకు, ఎంఎల్‌ఎలకు, ఎంపీలకు ఓట్లేసి గెలిపిస్తే మీ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని గుర్తు చేశారు. మాలాంటి వాళ్లు అడుగుతుంటే సమావేశంలో అవకాశమే ఇవ్వడం లేదన్నారు. ఒక వేళ చర్చ జరిగినా అడ్డ గోలుగా సమాధానం చెబుతున్నారని, రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసి రాజ్యాంగానికి తూట్లు పోడుతున్నారని విమర్శించారు. ఎపి సిఎం జగన్ తక్షణమే ఆశ వర్కర్ల సమస్య తీసుకుని పరిష్కారం చేయాలని లేకపోతే తాడేపల్లి, విజయవాడ రావాలో యూనియన్ నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, ఎన్.బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సకిలే సూర్యనారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ, కార్యదర్శి ఎన్.అబ్బులు, ధర్నాని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఎస్తేరు రాణి, మంగాదేవి, కనకదుర్గ, భువనేశ్వరి, రత్నం ,మహేశ్వరి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు .ధర్నా అనంతరం అడిషనల్ డిఎంహెచ్‌ఒకు వినతి పత్రాన్ని సమర్పించారు.
సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు ద్వారా పంపించాలి
అమలాపురం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ హైస్కూల్‌లో గత సంవత్సరం 3,4,5 తరగతులు విలీనం కాబడినవనీ ఈ పాఠశాల 3 నుంచి 10 తరగతుల్లో 400 మంది విద్యార్థులు, 12 సెక్షన్లతో సబ్జెక్టు టీచర్లు లేక నిర్వహణ కష్టతరముగా ఉందని పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐవి అన్నారు. జూన్ నెల చివరి వారంలో డిఎడ్ అర్హతలు గల 3 ఉపాధ్యాయులను సర్దుబాటు ద్వారా పంపించారనీ మండపేట మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలల్లో బియిడి అర్హతలు గలవారిని ఎలిమెంటరీలో ఉంచి డిఎడ్ అర్హతలు గలవారిని మండపేట రూరల్ ఎంఇఒ హైస్కూల్ కు సర్దుబాటు చేశారనీ, దీనిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. 400 మంది ఎన్రోల్మెంట్ కలిగిన ఉన్నత పాఠశాలకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మాథ్స్ సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు ద్వారా పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కమల కుమారికి విజ్ఞప్తి చేశారు.










