Jul 11,2023 00:02

ప్రజాశక్తి-అమలాపురం అర్జీలపై సత్వరమే స్పందించి తగు పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాల్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 244 అర్జీలను కలెక్టర్‌ శుక్లా డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబుతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి మెరుగ్గా, ప్రత్యామ్నాయంగా జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రజా సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాలు సులభంగా లభిస్తున్నాయన్నారు. సామాజిక భద్రతా పింఛన్లు, రెవెన్యూ భూ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాలు మంజూరు కోరుతూ దరఖాస్తుల అందాయన్నారు. ప్రతి జిల్లా స్థాయి అధికారి తమ లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులను వెంటనే ఓపెన్‌ చేసి విచారణ చేపట్టి విచారణ స్థాయిలో అర్జీదారునితో దిగిన ఫోటోలను మరియు విచారణ నివేదికలను స్పందన యాప్‌లో అప్లోడ్‌ చేస్తూ పూర్తిస్థాయిలో పరి ష్కార మార్గాలు చూపాలని స్పష్టం చేశారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా అధికారులు పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. డివిజన్‌, మండల స్థాయి నుంచి అందిన అర్జీలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత డివిజన్‌, మండల అధికారులతో సంప్రదించి అర్జీదారులకు అక్కడి కక్కడే పరిష్కార మార్గాలు చూపారు. జిల్లా స్థాయిలో అందిన సమస్యలపై అందుబాటులో ఉన్న జిల్లా అధికారులతో సంప్రదించి తగు పరిష్కార మార్గాలు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఒ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ పి.శివశంకర్‌ ప్రసాద్‌, డి ఎం అండ్‌ హెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర, డిఎస్‌ఒ ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ ఎస్‌.సుధాసాగర్‌, వివిధ శాఖలకు చెందిన జిల్లా సాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.