ప్రజాశక్తి-అమలాపురం
అందరి సహకారంతోనే జనాభా నియంత్రణ సాధ్యమని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు కోరారు.శనివారం స్థానిక కలెక్టరేట్ నందు ప్రపంచ జనాభా దినోత్సవం- 2023 కార్యక్రమాన్ని డిఆర్‌ఒ అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల స్థిరమైన వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తూ ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్ లు తీర్చడంలో ఇది పెద్ద సవాలుగా మారుతుందని తెలిపారు. పెరుగుతున్న జనాభా ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ఆహార కొరత, పోషకాహార లోపం, ఆకలి సమస్యలను కలిగిస్తుందన్నారు అధిక జనాభా విస్తతమైన పట్టణీకరణకు దారితీసిందన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యా లు లేకపోవడం ప్రజారోగ్యం, శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు.పెరుగుతున్న జనాభా సహజ వనరులపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుందని. అటవీ నిర్మూలన, నీటి కొరత పెరుగుతున్న జనాభాకు తగిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించడం కష్టతరమవుతోందన్నారు. జిల్లాలో ఇపిపిఐయుసిడి విధానాలను రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన డాక్టర్ బి.వీరభద్రుడు 202 మంది చేత అవలంబింప చేయించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. ఆయనకు ప్రోత్సాహంగా ఎన్‌హెచ్‌ఎం నిధుల ద్వారా రూ.7000 బహుమతిగా అందించామన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వైద్యురాలు జెబి మౌనిక పిపిఐయుసిడి విధానాన్ని 109 మంది చేత అవలంబింపజేసి రెండో స్థానంలో నిలిచారని వీరికి ప్రోత్సాహంగా రూ.5000 అందించామన్నారు. వేసక్టమి శస్త్ర చికిత్సలు నిర్వహణలో లక్కవరం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ ఎం.దుర్గాప్రసాద్ ఏడు నిర్వహించి మొదటి స్థానంలో నిలిచారని వీరికి రూ.4వేలు ప్రోత్సాహకం అందించామన్నారు. పిపిఐయుసిడి కుటుంబ నియంత్రణ పద్ధతులు చేయించుకున్న వారిని డిఆరఒ లక్కీ డ్రా తీయగా స్థానిక మండల పరిధిలో జనపల్లికి చెందిన సి.అలేఖ్య, రామచంద్రపురం మండలం ముచ్చుమిల్లికి చెందిన లంక లక్ష్మి ఎంపికయ్యారన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ప్రోత్సాహకాలు అందించామన్నారు. జిల్లాలో బెస్ట్ ఎఎన్‌ఎం, ఇద్దరు బెస్ట్ ఆశా వర్కర్లు ఇద్దరిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున ప్రోత్సాహంగా అందించామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర తదితరులు పాల్గొన్నారు.










