Sep 03,2023 00:12

ప్రజాశక్తి - అమలాపురం
డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం కలవరపెడుతున్నాయి. రెండు రోజుల నుంచి చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను మొహరింపజేశారు.
అమలాపురం రూరల్‌ మండలం కామనగరువులో మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌పై తిరగబడిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం కామనగరువులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు ఆయనపై తిరగబడ్డారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. రెండు రోజులైనా అరెస్ట్‌ చూపించలేదంటూ బాధితుల బంధువులు శుక్రవారం అర్ధరాత్రి అమలాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. యువకులను అక్రమంగా అరెస్టు చేశారంటూ వైసిపి నాయకుడు వాసంశెట్టి సుభాష్‌ పోలీసులను నిలదీశారు. అయితే నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు శనివారం వారిని కోర్టులో హాజరు పరిచారు.
అమలాపురంలో ఒక ఇల్లు ధ్వంసం
అమలాపురం ఈదరపల్లికి చెందిన బళ్ల సతీష్‌ ఇంటిని గుర్తుతెలియని దుండగులు శనివారం ధ్వంసం చేశారు. ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్‌ సామగ్రిని ధ్వంసం చేశారు. అమలాపురంలో శుక్రవారం జరిగిన రౌడీషీటర్‌ పోలిశెట్టి కిషోర్‌ హత్యలో సతీష్‌ ప్రధాన నిందితునిగా ఉన్నారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలుచోట్ల పోలీస్‌ పికెట్ల ఏర్పాటు
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. పలుచోట్ల పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు.. అమలాపురం మండలం ఈదరపల్లిలో పోలిశెట్టి కిషోర్‌ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్లంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నిప్పు పెట్టారు. దీంతో కొంకాపల్లిలో ఉన్న గంధం పల్లంరాజు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేవారు. వైసిపి నేత కిషోర్‌ హత్యకు ప్రతి చర్యగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అమలాపురం ఎర్ర వంతెన వద్ద సప్తగిరి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో గంధం పళ్ళంరాజు రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం నిర్వహిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో కొంతమంది వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నేపథ్యంలోనే యువకుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ఇరు వర్గాలు కొంత మంది రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిఐజి జివిజి.అశోక్‌ ఆదేశాల మేరకు ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌పి రవిప్రకాష్‌ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.