ప్రజాశక్తి- అమలాపురం
జీవితంలోనూ, కవిత్వంలోనూ నిజాయతీగా నిలబడి నిత్య చైతన్యంతో రుగ్మతల చీకటి సమాజంలో అక్షర వెలుగుల కిరణాలను ప్రసరింపజేసిన సంచార అక్షర యోధుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహన్‌రావు అని అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా శాఖ సభ్యులు అన్నారు. బుధవారం అమలాపురం కూచిమించివారి అగ్రహారంలోని సాయి సంజీవిని ఆసుపత్రి ఆడిటోరియంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అద్దేపల్లి రామమోహన్‌రావు జయంతి సభ జరిగింది. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి మాట్లాడారు. కాలంతో కలంతో పోరాడిన అక్షర యోధుడు డాక్టర్ అద్దేపల్లి అని అన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటిపై వెలువడిన తొలి విమర్శనా గ్రంథాన్ని అద్దేపల్లి రచించారన్నారు. తెలుగు ఉపాధ్యా యులు ప్రముఖ కవి మాకే బాలార్జున సత్యనా రాయణ మాట్లాడుతూ గోదావరి నా ప్రతిబింబం, పొగ చూరిన ఆకాశం, మెరుపు పువ్వు, కాలం మీద సంతకం వంటి కవితా సంపుటాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలన్నారు. విశ్రాంత భవిష్య నిధి అసిస్టెంట్ కమిషనర్, ప్రముఖ న్యాయవాది అద్దంకి అమరేశ్వరరావు, సంస్థ అధ్యక్షులు, సినీ క్యారెక్టర్ యాక్టర్ గుర్రం రామకృష్ణారావు, కడలి సత్యనారాయణ, జి.రమేష్, పాల్గొన్నారు.










