Sep 06,2023 22:31

కోరుమిల్లి లో చెరువు పై ఆక్రమణలు తొలగిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - కపిలేశ్వరపురం
మండలంలోని కోరుమిల్లిలో చెరువుగట్టుపై ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు బుధవారం అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో అప్పటి సర్పంచ్‌ సలాది వీరబాబు చెరువు ఆధునికీకరణ కోసం ఆక్రమణల తొలగింపునకు కోర్టును ఆశ్రయించారు. చెరువు గట్టుపై ఉన్న నిర్వాసితులకు పంచాయతీ అధికారులు అనేకమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ తొలగింపు పనులు జరగలేదని గ్రామ కార్యదర్శి కామేశ్వరరావు తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగించేందుకు పోలీస్‌ బందోబస్తు మధ్య గతేడాది డిసెంబర్‌ 2022లో పంచాయతీ అధికారులు సిద్ధం కాగా కొద్దికాలం పాటు తొలగింపును వాయిదా వేయాలంటూ ఆక్రమణదారులు ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన కలెక్టర్‌తో మాట్లాడి వాయిదా వేయించారన్నారు. ఇచ్చిన గడువు పూర్తవడంతో బుధవారం పంచాయతీ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఒక గృహాన్ని కూల్చివేసేందుకు సిద్ధపడగా నిర్వాసితురాలు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను వారించారు. దీనిపై గ్రామ కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ ఆక్రమణలను పోలీసనుల సహకారంతో తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాల సిబ్బంది పాల్గొన్నారు.