Jul 13,2023 14:31

ప్రజాశక్తి-రామచంద్రపురం : నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా రావడంతో తొలకరి పొలం పనులు మందకోడిగా మొదలయ్యాయి. జూన్‌లో కురవాల్సిన వర్షాలు జూలై రెండవ వారం వరకు కురవకపోవడంతో రైతులు తొలకరి సేద్యంపై మందకోడిగా పనులు ప్రారంభించారు. అయితే బుధవారం నుండి వర్షాలు జోరుగా కురవడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో తొలకరిపొలం పనులు వేగం పుంజుకున్నాయి. దాల్వా పంటలు ఆశాజనకంగా పండినప్పటికీ చివరి దశలో ఆకాల వర్షాలు వల్ల రైతులు కొంత నిరాశకు గురైన తిరిగి తొలకరి పంటపై దృష్టి సారించారు. వర్షం వల్ల వరి చేల్లో నీరు చేరడంతో రైతన్నలు తొలకరిదమ్ములు ముమ్మరంగా ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్నవర్షాల వల్ల వాతావరణం సేద్యానికి అనుకూలించడమే కాక వ్యవసాయ కూలీలకు రైతులకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో తొలకరి పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అధిక శాతం రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా 10 శాతం వరకు రైతన్నలు వెదజల్లే పద్ధతిలో తొలకరి సేద్యం ప్రారంభిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వ్యవసాయ రంగానికి ముఖ్యంగా తొలకరి పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలువు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.