Aug 28,2023 16:33

ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : రైతుల ముసుగులో గ్రావెల్‌ అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో తహశీల్దార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని ద్వారపూడి శివారు వేములపల్లిలో రైతుల ముసుగులో అక్రమ మైనింగ్‌ చేపట్టారని రెండు నెలల నుంచి ఈ విషయంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నాయకుల ఓత్తిడికి తలొగ్గి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. పుంతగట్లకు రెండు లారీలు వేసి మిగిలిన 98 లారీలు అక్రమంగా అమ్ముకుంటూ కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఈ నెల 22న మైనింగ్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రావెల్‌ తవ్వకాలపై అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలన చేస్తామని చెప్పి అధికారులు కప్పదాటు వ్యవహారంతో ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టి పరీశీలన వాయిదా వేసారన్నారు. తిరిగి ఎప్పుడు పరిశీలన చేస్తారో చెప్పమంటే మైనింగ్‌ అధికారులు ఫోను ఎత్తడం లేదన్నారు. తహశీల్దార్‌ కార్యాలయానికి అనేక మార్లు ఫిర్యాదు చేసినా దానిని రిజిస్టర్‌ చెయ్యకుండా మైనింగ్‌ అధికారులకు ఫార్వర్డ్‌ చేస్తూ చెతులుదులుపుకుంటున్నారన్నారు. రైతుల అభివృద్ధికి తానెప్పుడు సహకరిస్తానని కానీ రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడితే సహించమని మైనింగ్‌ అక్రమాలపై నిజనిర్ధారణకు సిధ్దమని సవాల్‌ విసిరారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.