ప్రజాశక్తి-కపిలేశ్వరపురం(కోనసీమ) : రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, జెడ్పిటిసి పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ మూర్తిలు అన్నారు. మంగళవారం మండపేట ప్రాజెక్టు పరిధిలోని కపిలేశ్వరపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు, నిర్వహించిన సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఏ గజలక్ష్మి మాట్లాడుతూ.. మండలంలో 78 అంగనవాడి సెంటర్లు ఉన్నాయని, సుమారు 782 మంది గర్భవతులు, బాలింతలు ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద అందించే రేషన్ సరుకుల్లో రాగి పిండి, చిరుధాన్యాలతో కూడిన పిండి, బెల్లం, చిక్కీ, ఎండు ఖర్జూరం, మేలురకం బియ్యం, పప్పు, వంటనూనె, గుడ్లు, పాలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. అనంతరం వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.రామకృష్ణ రెడ్డి, తహశీల్దార్ కె.సూర్యారావు, ఉప సర్పంచ్ బొక్కా రాంబాబు, గ్రామ అధ్యక్షులు కట్టా మురళీకృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పి.వెంకటలక్ష్మి, ఐ.మాణిక్యం, ఎన్.పుణ్యవతి, అంగనవాడీల కార్యకర్తలు, ఆయాలు, ఏఎన్‌ఎంలు, చిన్నారుల తల్లులు, బాలింతలు, గర్భిణీలు, పాల్గొన్నారు.










