ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : గోదావరి వరద బాధితులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో సుమారు 750 బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, నూనె, బంగాళాదుంపలను కేజీ చోప్పున అందజేశారు. అదేవిధంగా ఐలాండ్ గ్రామమైన శెరిలంకలోను వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ వరద బాధిత ప్రాంతాల్లో వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని.. దీనిపై జిల్లా అధికారులతో మాట్లాడి వరద బాధితులకు అవసరమైన నిత్యవసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రేవు శ్రీను,పెట్ట శ్రీనివాసరావు, బత్తుల అప్పారావు, గ్రామ సర్పంచ్ పెమ్మాడి బేబీ సత్తిబాబు, తహశీల్దార్ వైద్యనాథ్ శర్మ వీఆర్వో కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు.










