- జేఏసీ ఆధ్వర్యంలో నిరసన.. వాహనాల రాకపోకలు బంద్
ప్రజాశక్తి మండపేట(కోనసీమ) : మండలంలోని ద్వారపూడి- తాపేశ్వరం రోడ్డు పూర్తయ్యేంత వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తాపేశ్వరం గ్రామం నుంచి ఇప్పనపాడు వరకు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాహనాలు ఎదురెదురుగా వచ్చే సమయంలో ద్విచక్ర వాహనాలకు ఇబ్బంది లేకుండా బెర్ములు వెయ్యాలని చెప్పినప్పటికీ అధికారుల స్పందించలేదన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరంతరం రోడ్డు పర్యవేక్షణ చేపడతామన్నారు. అనంతరం కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రోడ్డు నిర్మాణం, తదితర విషయాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రోడ్డుకు మోక్షం కల్పించాలని పోరాటం చేసే చరిత్ర తాపేశ్వరం ద్వారపూడి రోడ్డులో ఉందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. రోడ్డు భవనాల శాఖ జేఈ సూర్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభించామని నెల రోజుల్లో సుమారు 950 మీటర్లు సిసి రోడ్డు వేస్తామన్నారు. వేసవిలో కల్వర్టుల నిర్మాణం అనంతరం డ్రైన్ల పనులు పూర్తి చేస్తామన్నారు. రోడ్డు పనులకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలు రాకపోకలు నిలిపివేస్తామన్నారు. సమావేశంలో సిఐటియు నాయకులు ఎన్. బలరాం, వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.










