3.11 లక్షల ఎకరాల్లో వరికి నష్టం - మరో 12 వేల ఎకరాల్లో ఉద్యాన, ఇతర పంటలకు దెబ్బ
నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారు. కృష్ణాపశ్చిమ డెల్టాతో పాటు సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వరి సాగు చేసిన రైతులకు నిఫర్ తుపాన్ బాగా దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదనకు గురవు తున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసి వరి పంట నీటి పాలు అయిందని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటన్నది వారు ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతులు ఇంకా ఎక్కువగా నష్టపోయారు. జిల్లాలో వెదపద్ధతిలో సాగుచేసిన రైతులకు కూడా బాగా నష్టం జరిగింది. మరో పక్షం రోజుల్లో కోతలకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలవాలడం రైతులను కలవరపరుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు నేలవాలిన పైరు ఎంత వరకు నిలదొక్కు కుంటుందన్న అంశంపై అధికారులు కూడా ఇప్పుడే చెప్పలేమ ంటున్నారు. మరో వైపు డిసెంబరు 2న మరో తుపాను, ఐదో తారీఖు మరో తుపాను ఏర్పడటం వల్ల రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు నేలవాలిన వరిని కోసే పరిస్థితి లేదు. వీటిని కట్టలు కట్టి నిలబెట్టే ప్రయత్నిస్తున్నారు. కనీసం 10 రోజులు ఎండ కాస్తే పంట కొంత మేరకు కోలుకునే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.జిల్లాలో 5.15 లక్ష ఎకరాల్లో వరి సాగు చేయగా నివర్ తుపాను ప్రభావంతో వీసిన గాలుల వల్ల 3.11 లక్షల ఎకరాల్లో వరిపైరు నేల వాలింది. ఇందులో కోసిన వరి ఓదెలు నీటిపాలయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పాలుపోసుకునేదశలో వున్న వరి పైరునేల వాలింది. అమృతలూరు మండలంలో అత్యధికంగా 22 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. జిల్లాలో 1300 ఎకరాల్లో మినుము, 400 ఎకరాల్లో వేరుశనగ, వెయ్యి ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాల ప్రకారం తెలిసింది. అలాగే మిర్చి , ఇతర ఉద్యాన పంటలకు మరో ఎనిమిదివేల ఎకరాల్లో నష్టం జరిగింది. మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షాలు కొనసాగాయి. అయితే శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షాలు తగ్గుముఖం పట్టగా సాయంత్రం మళ్లీ ప్రారంభం అయ్యాయి. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 74 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. బాపట్ల, దుగ్గిరాల, నూజెండ్ల, చిలకలూరిపేట, వేమూరు, కాకుమాను, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. మొత్తం 57 మండలాలకు గాను ఎనిమిది మండలాల్లో కుంభ వృష్టిగా వర్షం కురవగా మిగతా చోట్ట భారీ వర్షం జిల్లాలో చలిగాలులు పెరిగాయి. వర్షాలతో చలి మరింత పెరిగింది. దీంతో వృద్దులు, చిన్నారులు బాగా ఇబ్బంది పడుతున్నారు.
తెనాలి మండలం కఠెవరంలో నీటమునిగిన వరి ఓదెలను పరిశీలిస్తున్న రైతులు










