Aug 31,2023 00:46

సిపిఎం నాయకులకు సమస్యలను చెబుతున్న మహిళలు

ప్రజాశక్తి - అమరావతి : విద్యుత్‌ బిల్లులు ప్రతినెలా పెరుగుతున్నాయేగాని తగ్గడం లేదని సిపిఎం నాయకుల ఎదుట ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. మండల కేంద్రమైన అమరావతిలోని జగ్జీవన్‌రామ్‌ కాలనీ, సుభాని కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వివరించారు. గతంలో రూ.200 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.500 వరకూ వస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాల కింద వస్తున్న డబ్బులకు బయట ధరల పెరుగుదల వల్ల అవుతున్న ఖర్చులకు పొంతనే లేదన్నారు. నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అనంతరం సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు మాట్లాడుతూ ప్రజల మీద భారాలు వేస్తున్న కేంద్రలోని బిజెపి విధానాలను రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం లేదని, పైగా రాష్ట్ర ప్రభుత్వమూ భారాలు వేస్తోందని విమర్శించారు. సిపిఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో స్థానిక సంస్థలు విఫలమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులను ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం 4వ తేదీన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌.రాజకుమార్‌, ఎన్‌.వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : అధిక ధరలు, నిరుద్యోగం విద్యుత్‌ ఛార్జీలు, ప్రజలపై ప్రభుత్వాలు వేస్తున్న ఇతర భారాలకు నిరసనగా 4వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే సమరభేరిని జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయులు నాయక్‌ పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆ పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆంజనేయులు నాయక్‌ మాట్లా డుతూ మోడీ తాన అంటే జగన్మోహన్‌రెడ్డి తందానా అంటున్నారని, ప్రజలపై మోడీ మోపే భారాలను కనీసం ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టే ఆందోళనల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బి.మహేష్‌, వెంకటరత్నం, రమణ, వై.సురేష్‌, రాజు, ఆదిత్య పాల్గొన్నారు.