Aug 22,2023 21:48

ప్రజాశక్తి - సాలూరు : మున్సిపాలిటీలో ఎఇగా పని చేస్తున్న ఎల్‌.సూరినాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్‌గా నియమిస్తూ మున్సిపల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈనెల 9న అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన కమిషనర్‌ హెచ్‌ శంకరరావును సస్పెండ్‌ చేశారు. దీంతో గత పదిరోజులుగా కమిషనర్‌గా ఎవర్నీ నియమించలేదు. మున్సిపాలిటీలో దైనందిన కార్యక్రమాలు స్తంభించిపోవడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఎఇ సూరినాయుడుకు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఇన్‌ఛార్జి డిఇ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రేసులో ముగ్గురు అధికారులు
మున్సిపల్‌ కమిషనర్‌ గా ఇక్కడ చేయడానికి ముగ్గురు అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జివిఎంసిలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కమిషనర్‌గా రావడానికి పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలకొండ నగర పంచాయతీ మేనేజర్‌గా పని చేస్తున్న అధికారికి డిప్యూటీ సీఎం రాజన్నదొర సిఫార్సు చేసినట్లు సమాచారం.