ప్రజాశక్తి-రంపచోడవరం
ఓటర్ జాబితాలో తప్పులు సరి చేయుటకు రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో ఇంటింటి బూత్ స్థాయి సర్వే 99 శాతం పూర్తి చేసినట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ సవరణ ప్రక్రియ గురించి సబ్ కలెక్టర్ సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో11 మండలాలలో ఎన్నికల సంఘం నిబంధన మేరకు బూత్ స్థాయిలో సర్వే చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 399 పోలింగ్ బూతుల పరిధిలో ప్రస్తుతం 2 లక్షల, 72 వేల నలుగురు ఓటర్లు ఉన్నారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుండి అక్టోబర్ 18వ వరకు ఫారం-6 ద్వారా ఓటర్ల నమోదు కొరకు 376 దరఖాస్తులు, ఫారం-7 ద్వారా చనిపోయిన వారి పేర్లు తొలగింపునకు 1047, ఫారం-8 ద్వారా ఓటర్ పేర్లలో తప్పులు, ఫొటోలు సరి చేయడానికి 1147 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముందు రోజు వరకు ఓటర్ల జాబితాలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత ఫారములు ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల బూతులు, ఓటర్ కార్డులో తప్పులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని వివిధ పార్టీల ప్రతినిధులను సబ్ కలెక్టర్ కోరారు. ఇంకా ఎక్కడైనా పోలింగ్ బూతులు ఏర్పాటు అవసరమైతే లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేస్తే ప్రతిపాదన జిల్లా కలెక్టర్‌కి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎస్.బోజ్జిరెడ్డి, పి.శ్రీనివాసరావు, ఎం.వాణిశ్రీ, ముర్ల కృష్ణారెడ్డి, ఎం.ఈశ్వరరావు, డిప్యూటీ తహశీల్దారు ఎన్‌వివి.సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు డి.ఇందిరాబాయి, టి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.










