ప్రజాశక్తి-ఆదోనిరూరల్
గత కొద్దిరోజుల నుంచి వాతావరణంలో మార్పుల వల్ల మండలంలోని చాలా గ్రామాల్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా వైరల్ ఫీవర్ వణికిస్తోంది. పగటి పూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడితే చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ మార్పుల వల్లే జ్వరాలు వెంటాడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
మండలంలో రోజురోజుకు వైరల్ ఫీవర్‌తో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగీ, చికున్ గున్యా లాంటి జరాలు అధికమవుతున్నాయి. మండలంలోని ఓ గ్రామంలో కుటుంబంలో కనీసం ఒకరికి జ్వరం వచ్చినట్లు సమాచారం. వైరల్ ఫీవర్‌తో ప్రజలు ప్రయివేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. విషజ్వరాల కారణంగా ప్రయివేట్ ఆస్పత్రులు రద్దీగా మారుతున్నాయి. కొందరు ప్రయివేట్ ఆస్పత్రి యాజమాన్యాలు రకరకాల పరీక్షల పేరుతో ప్రజల దగ్గర ఫీజులు దండుకుంటున్నారు. గ్రామాల్లో ఆర్‌ఎంపిలు, ప్రయివేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఆదోనిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు సక్రమంగా వైద్యం అందడం లేదని చర్చించుకుంటున్నారు.
ఆదోని ఏరియా ఆస్పత్రిలో విష జ్వరాలతో జనం వణికిపోతున్నారు. ఏ ఇంట చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. ఆదోని ప్రభుత్వాస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. గతంలో రోజూ 259 వరకు ఒపి వస్తుండగా వారం రోజులుగా 500 నుంచి 700 వరకు నమోదవుతోంది. సోమవారం ఒక్క రోజే 280కి పైగా అవుట్ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చారు. పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒపి విభాగం వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒపి చీటీలను మాన్యువల్‌గా రాసి ఇవ్వాల్సి వచ్చింది.
అన్ని వార్డులు కిటకిట
జ్వరం, వాంతులు, విరోచనాలతో జనం ఆస్పత్రిలో చేరుతున్నారు. వార్డులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోగుల రద్దీ కారణంగా కాన్పుల వార్డును సైతం రోగుల కోసం వినియోగిస్తున్నారు. సరిపడ బెడ్లు లేకపోవడంతో ఒక మంచంపై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. సోమవారం అన్ని వార్డుల్లో 60 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. బెడ్ల కొరత వల్ల వ్యాధి కొద్దిగా నయం కాగానే డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది.
రోగుల తాకిడి పెరిగింది
- ఆదోని ఏరియా ఆస్పత్రి హెడ్ నర్సు
విష జ్వరాల కారణంగా ఆస్పత్రికి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాధితుల్లో అధికంగా జ్వరపీడితులే ఉంటున్నారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులూ జ్వరపీడితులతో నిండిపోయాయి. బెడ్లు సరిపోవడం లేదు. రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నాం.
రెండు రోజులుగా ఒకే మంచంపై ఇద్దరు ఉన్నాం
- రోజా, ఆదోని
పాపకు జ్వరం వస్తే రెండురోజుల క్రితం ఆదోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాను. జ్వరం ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ప్రస్తుతం గ్లూకోజ్‌లు ఎక్కుతున్నాయి. బెడ్లు సరిపడ లేకపోవడంతో మా పాప మంచంపై మరో అమ్మాయిని ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వైద్యం మంచిగానే ఉంది.
గ్రామాల్లో వైద్య శిబిరాలేవి..?
మండలంలోని ప్రజలు వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నా గ్రామాల్లో ఎక్కడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్యం కోసం క్యూలో నిల్చున్న ప్రజలు










