Oct 06,2023 20:51

అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామం

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  స్వాతంత్య్రం వచ్చి ఏడు దశబ్దాలు గడిచిపోయాయి. ప్రపంచం సాంకేతిక రంగంలో పరుగులు తీస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే మారుమూల కొండలపైనున్న గిరిజన ప్రాంతాలు మాత్రం నేటికీ వెనుకబడి ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోక కనీస సౌకర్యాలకు దూరమయ్యాయి. ఎన్నో ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా, అధికారులు వచ్చి వెళ్తున్నా గిరిజన జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. గిరిజన సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘం ఎన్నో సార్లు పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళన చేపడుతున్నా అధికారులు, పాలకుల్లో చలనం ఉండడం లేదు. దీంతో వేలాది మంది గిరిజనులు విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులకు నోచుకోక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

  • నేటికీ కాలిబాటే..... :

గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కొండశిఖర గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం లేకపోవడంతో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. శిఖరపాయి, జాపయి, వాడబాయి, వామసి, కప్పఖల్లు, దేరుగండ, వన కాబడి వాడ పుట్టి, జోగి పురం, శంభుగూడ, వాడ జంగి, ఇజ్జ కాయి, టంకు, గుల్లలంక, మంత్ర జోల, చిన్న రావి కోన, కొండ బిన్నిడి, బయ్యాడ తదితర మారుమూల గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వాహన సౌకర్యం లేక నేటికీ కాలిబాటనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతినెలా రేషన్‌ బియ్యం, నిత్యవసర వస్తువుల కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం నాలుగైదు కిలోమీటర్లు కొండ దిగితేనే వీరికి కడుపునిండేది. ఇక్కడ బోరు బావులు లేక ఊట బావులు, చలములపైనే ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కలుషితమైన నీరు తాగడంతో గిరిజనులు ఎప్పటికప్పుడు వ్యాధుల బారిన ఆసుపత్రి పాలవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

  • శిథిలమైన ఇళ్లల్లోనే జీవనం....

ఎన్నో ఏళ్లు కిందట నిర్మించుకున్న మట్టి గోడల రేకిళ్లు, పూరిపాకలోనే గిరిజనులు తల దాచుకుంటున్నారు. పక్కా గృహాలు మంజూరైనా కొండల మీదకు ఇంటి నిర్మాణ సామాగ్రి తీసుకువెళ్లడానికి వీల్లేకపోవడం కట్టుకోలేని పరిస్థితి. శిథిలమైన ఇళ్లలోనే క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్నారు. ఇక్కడ గిరిజన విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష గానే ఉంటుంది.

  • పడకేసిన చెక్‌ డ్యాములు...

ఏజెన్సీ ప్రాంతంలో పంట పొలాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన మినీ రిజర్వాయర్లు, చెక్‌ డ్యాములు నిర్వహణ లోపంతో పడకేశాయి. గండ్ర, కొత్తగూడ, వంగర, కీసర, కీసరగూడ, డుమ్మంగి తదితర ప్రాంతాల్లో మైనర్‌ ఇరిగేషన్‌, పిటిజి, ఉపాధిహామీ నిధులతో చెక్‌డ్యామ్‌ నిర్మాణాలు చేపట్టారు. అయితే నిర్వహణా లోపం కారణంగా శిథిలమయ్యాయి. సీమలగూడ మినీ రిజర్వాయర్‌ అభివృద్ధికి మూడుసార్లు ప్రతిపాదనలు చేసిన కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌లో పంట పొలాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి.

  • వైద్యం అంతంత మాత్రమే

ఏజెన్సీలో వైద్య సేవలు గిరిజనులకు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆసుపత్రుల వద్ద రోగుల తాకిడి పెద్ద సంఖ్యలో ఉంటుంది. మంచాలు చాలకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులు వైద్యం పొందుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్‌ డెంగీ వ్యాధులకు సరైన వైద్యం అందకపోవడంతో పార్వతీపురం, విజయనగరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం పొందుతున్నారు. తాడికొండ, దుడ్డుఖల్లు, రేగిడి పిహెచ్‌సిల్లో సరైన సౌకర్యాలు లేక గర్భిణీలను ప్రాథమిక చికిత్స అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించడం పరిపాటిగా మారింది. కొండలపై గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో 108 అంబులెన్స్‌ సేవలు వీరికి అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో డోలీల సాయంతో రోగులను కొండ కిందకు తీసుకువచ్చి అక్కడ నుంచి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో మార్గమధ్యలో మృత్యువాత పడిన గిరిజనులు ఎంతోమంది ఉన్నారు.

  • మౌలిక సదుపాయాలు కల్పించాలి..

కొండలపై గిరిజన గ్రామాల్లో ప్రజల కష్టాలను గుర్తించాలి. రోడ్డు నిర్మాణం చేపట్టి తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడితే గిరిజన కష్టాలు కొంతమేర తీరుతాయి.
- పువ్వల తిరుపతిరావు, సిపిఎం మండల నాయకులు.

  • గిరిజనుల పట్ల చిన్నచూపు

ప్రభుత్వాలు, అధికారులు మారుతున్న గిరిజనుల పట్ల చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. మా సమస్యలు పరిష్కరించండి బాబు అంటూ వందలాది సార్లు వినతులు సమర్పించిన స్పందించలేదు. గిరిజన సంక్షేమం పట్టని ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఒక్కటే.
- కోలక అవినాష్‌, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి.