కొత్తచెరువు, పుట్టపర్తి అర్బన్ : జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు జాప్యం కాకుండా వేగవంతంగా పనులు పూర్తియ్యేలా లబ్ధిదారులను చైతన్యం చేసి వారికి సహకారం అందించాలని కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులకు సూచించారు. శనివారం నాడు మండల కేంద్రంలోని ధర్మవరం రోడ్ పక్కన ఉన్న 384 సర్వే నెంబర్లు జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తచెరువులో మూడు కాలనీల్లో కలిపి వెయ్యి మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా ఇందులో 70 శాతం పునాదుల స్థాయిలో ఉన్నాయన్నారు. మిగిలిన 30 శాతం కూడా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయనని తెలిపారు. ఈ నిర్మాణాలను వేగవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జగన్న కాలనీల్లో రహదారులు, విద్యుత్, నీటి సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూన్ నెల ఆఖరికి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. బిల్లులు కూడా వారికి త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ సిబ్బందికి తెలిపారు. నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడాలి పనులు మొదలు పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. పెనుగొండ రహదారిలో 483 సర్వే నంబర్‌లో జగనన్న కాలనీకి వెళ్లే రహదారికి స్థలం ఇచ్చిన రైతులకు నష్టపరిహారం సంవత్సరమైనా ఇప్పటికీ ఇవ్వలేదని బాధితులు కలెక్టర్ దష్టికి తీసుకెళ్లారు. త్వరితిగతన ఈ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ వారికి హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జిల్లా పీడీ చంద్రమౌళి రెడ్డి, ఎంపీడీవో సిద్ధారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ వెంకట్ రెడ్డి, హౌసింగ్ ఏఈ రమణారెడ్డి, ఏపిఎం నాగేంద్ర, పిఆర్‌జెఈ నాగరాజు, విద్యుత్ ఏఈ వెంకటేష్ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఓబులేసు పాల్గొన్నారు.
ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్సీ లబ్ధిదారులను గుర్తించండి
పుట్టపర్తి అర్బన్: ఆయా గ్రామాల్లో ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్సీ లబ్ధిదారులను గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ప్రకతి వ్యవసాయం సంబంధిత లబ్ధిదారుల గుర్తింపుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీఎస్‌ఎఫ్‌లో భాగంగా ప్రకతి వ్యవసాయం చేస్తున్న లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లాలో 1055 మంది ఎస్సీ రైతులు ప్రకతి వ్యవసాయం చేస్తున్నారని, ఎస్సీ కార్పొరేషన్ ఎమ్‌డికి రైతు సాధికారిక సంస్థ ద్వారా నివేదిక అందజేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారంతా ప్రకతి వ్యవసాయం చేస్తున్నారా.? లేదా.? అన్న దానిని పరిశీలించాలన్నారు. ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల ప్రకారం రూ.1.50కోట్లు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని నిజమైన ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్సీ లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, డిపిఎం, ఆగ్రోస్ సీడ్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పర్యటించి నిజమైన లబ్ధిదారులను త్వరగతిన గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డీఈ ప్రభాకరరావు, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఆగ్రోస్, సీడ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.










