కదిరి టౌన్ : జగనన్న హౌసింగ్ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పురోగతిని మరింత పెంచి జూన్ నెలాఖరులోపు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అరుణ్‌బాబు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న జగనన్న హౌసింగ్ లేఔట్‌ను పరిశీలించారు. అక్కడి ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి వేగవంతం చేయాలన్నారు. బిలో బేస్మెంట్ స్థాయి నుంచి బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయి నుంచి మరింత పురోగతిలోకి ఇళ్ల నిర్మాణాలను తీసుకెళ్లాలని సూచించారు. ఆర్‌ఎల్, ఆర్సీ స్థాయిలోని ఇళ్ల నిర్మాణాలు ఖచ్ఛితంగా లక్ష్యం మేరకు పూర్తి చేయాలని, జూన్ నెలాఖరులోపు నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న జగనన్న హౌసింగ్ లేఅవుట్‌లో 977 ఇళ్లు మంజూరు కాగా, మొత్తం ఇళ్లకు మ్యాపింగ్ పూర్తి అయ్యిందన్నారు. 961 ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తయిందని, మిగిలిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో 452 ఇళ్లు ఉండగా, బేస్మెంట్ స్థాయిలో 294, ఆర్‌ఎల్ స్థాయిలో 62, ఆర్సీ స్థాయిలో 18 ఉన్నాయన్నారు. 135 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఇక లేఅవుట్‌లో తాగునీరు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, ఆర్డీవో రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
గాండ్లపెంట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అరుణ్‌బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రులు మందులు ఉన్నాయా అని డిఎంఅండ్‌హెచ్‌ఒ కృష్ణారెడ్డి, ప్రాథమిక వైద్యాధికారి మారుతి, మహేశ్వర ప్రసాదులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం మండల పరిధిలోని కటారుపల్లి శ్రీ యోగివేమన ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, వీఆర్వోలు రఘు, జయరాం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










