Sep 23,2023 20:30

నిద్రలో ఉన్న వైద్యాధికారి పార్వతమ్మ

ప్రజాశక్తి - చిప్పగిరి
సమాజంలో అన్ని సేవల కన్నా వైద్య సేవలు మిన్న.. పేదలు, సామాన్యులను అనారోగ్యాల నుంచి కాపాడేందుకు వైద్యసేవలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. చిప్పగిరిలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు వైద్య సేవలు మరిచి డాక్టర్‌ సీటులో కూర్చుని నిద్రపోతున్న వైనం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌ పార్వతమ్మ వైద్య సేవలు మరిచి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి కుర్చీలో నిద్రపోతుంటే రోగులకు సేవలు ఏ విధంగా అందుతాయని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిప్పగిరి మండలం ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు వైద్యులను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు సిబ్బందిని కూడా నియమించింది. చిప్పగిరి మండలంలో 13 పంచాయతీలు, 16 గ్రామాలు ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో జ్వరం వచ్చినా, ప్రజలకు ఏ రోగం వచ్చినా చిప్పగిరి ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయిస్తారు. ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లాలంటే అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో గర్భిణులు, ప్రమాద కేసులు ప్రభుత్వ వైద్యశాలను చేరుకొని చికిత్సలు పొందుతారు. శనివారం చిప్పగిరి వైద్యాధికారి డాక్టర్‌ పార్వతమ్మ విధుల్లో ఉంటూ నిద్రపోతుండడంతో ఆస్పత్రికి వచ్చిన పలువురు రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు రోగులు మాట్లాడుతూ... ప్రభుత్వ సేవల్లో భాగంగా జిల్లా అధికారులు చేసే కృషిని, కింది స్థాయి వైద్యాధికారులు నీరుగారుస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారులు చిప్పగిరి ప్రభుత్వాస్పత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.