వాషింగ్టన్ : వినియోగదారులకి భద్రతను అందించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. ఇకపై గూగుల్ వినియోగదారులు తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు రెండు దశల ధృవీకరణను (2 Step Verification) తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించింది. దీనిపై ఈ ఏడాది మేలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 9 నుండి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ''2021 చివరికల్లా 150 మిలియన్ గూగుల్ యూజర్స్, 2 మిలియన్ల యూట్యూబ్ యూజర్స్ ఈ ఫీచర్‌ను తప్పక ఉపయోగించాల్సిందే'' అని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ నవంబరు 9లోపు వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోకున్నప్పటికీ.. ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుందని గూగుల్ తెలిపింది.
ఎనేబుల్ చేయడమెలా..
మీ జీమెయిల్ ఐడీతో గూగుల్ లాగిన్ చేసిన తర్వాత కుడివైపు మీ పేరు లేదా ఫొటో ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆఫ్ అని కనిపిస్తుంటే దానిపై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు కొనసాగించమని కోరుతుంది. అనంతరం మీ ఫోన్‌కి ఒటిపి వస్తుంది. అది టైప్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది.










