ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఇక్కడ గిరిజనులుగా పుట్టడమే పాపమా... రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేకపోవడమే వీరి శాపమా... అందుకు కారణం ఆ పంచాయతీ నాన్ షెడ్యూల్డ్ గ్రామంగా ఉండటమే. వివరాల్లోకి వెళ్తే ..
మండలం నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతం. అయినప్పటికీ దుడ్డుఖల్లు పంచాయతీ మాత్రం అందుకు భిన్నం. నాన్ షెడ్యూల్డ్ పంచాయతీగానే పరిగణించబడింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ పంచాయతీలో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు గానీ, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు రిజర్వేషన్లు గానీ వర్తించడం లేదు. ఐటిడిఎ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న వ్యవసాయ రుణాలు, బోరు బావులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అందడం లేదు .దుడ్డు ఖల్లు పంచాయతీలో 15 గ్రామాలు ఉన్నాయి. వీటిలో కొత్తవలస, బెల్లిడి, దొరజమ్ము, కంబగూడ, దొరకెక్కువ, కొల్లిగూడ, లోవలక్ష్మీపురం, విశ్వనాధపురం, దుడ్డు ఖల్లు, బుడ్డెంఖర్జ, మేదరగండ, పిల్లి గూడ, బొడ్లగూడ, చింతలపాడు గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్డ్ గ్రామాలుగానే పరిగణించబడుతున్నాయి. నాన్‌షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినా ఆ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పై గ్రామాల్లో నివసిస్తున్న వారు గిరిజనులుగా ఉన్నా రిజర్వేషన్ల ప్రక్రియ వీడిదరి చేరడం లేదు. దీంతో చదువుకుని ఉన్న గిరిజన యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. గిరిజన రైతులకు ఎటువంటి వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ రాయతీలు అందక ప్రతి ఏటా అప్పులు చేసి పంటలను పండిస్తున్నారు. పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందడం లేదు. పక్కా గృహాలు లేవు. తాగునీటి సమస్య వెంటాడుతుంది. 1/70చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం వీరికి వర్తించదు.
ఉపాధి అవకాశాలు లేవు ...
మా గ్రామం నాన్ షెడ్యూల్డ్ గ్రామంగా ఉండడంతో ఇక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నాం. నేను డిగ్రీ చదువుకున్నా రిజర్వేషన్ లేక ఉద్యోగం రాక నిరుద్యోగిగా ఉన్నాను. ప్రభుత్వం స్పందించి మా గ్రామాన్ని షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాలి.
బిడ్డిక సంధ్యశ్రీ
గిరిజన యువతి, దుడ్డుఖల్లు.
ప్రభుత్వ రాయతీలకు దూరం :...
దుడ్డుఖల్లు పంచాయతీ నాన్ షెడ్యూల్డ్‌గా ఉండడంతో ఈ పంచాయతీలో ప్రజలు ప్రభుత్వ రాయితీలకు దూరంగా ఉన్నారు. ఐటిడిఎ ద్వారా ఎటువంటి రుణాలు అందడం లేదు. దీంతో పూర్తిగా వెనుకబడి ఉన్నాం. ఇక్కడ పుట్టడమే పాపమా?.
కొండ గొర్రి గోపాలరావు,
గిరిజన యువకుడు, దుడ్డుఖల్లు.
షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాలి:...
దుడ్డుఖల్లు పంచాయతీ నాన్ షెడ్యూల్డ్ గ్రామంగా ఉండడంతో రాజ్యాంగం కల్పించిన హక్కులు గిరిజనులకు అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రిజర్వేషన్ దూరమైంది. అనేక ఏళ్ల నాటి సమస్యను ప్రభుత్వం గుర్తించి షెడ్యూల్డ్ పరిధిలోకి తీసుకొస్తే యువత, మహిళలు, రైతులకు అభివద్ధికి అవకాశం ఉంటుంది.
పి.తిరుపతి రావు
సిపిఎం మండల నాయకులు,










