Aug 25,2023 21:15

కొటియా చెక్‌పోస్టు వద్ద ఆంధ్రా వైద్యాధికారులను అడ్డుకున్న ఒడిశా పోలీసులు

సాలూరు: కొటియా గ్రామాల నుంచి ఆంధ్రా గోబ్యాక్‌ అని గర్జించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం డిప్యూటీ పిఎం రాజన్నదొర నవ్వులాట ఆడారు. గిరిజన యూని వర్సిటీ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజన్నదొర భుజం తడుతూ హాస్యమాడిన దృశ్యం కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొటియా గ్రామం పట్టు చెన్నూరులో పర్యటించిన కేంద్ర మంత్రికి అక్కడ ఎదురైన ఎపి పోలీసులనుద్దేశించి ఆంధ్రా గోబ్యాక్‌ అన్నారు. కొటియాలో మీకేం పని ఆయన నిలదీశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని రాజన్నదొర వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఒకే వేదిక మీద కలుసుకుని కరచాలనం చేసుకున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరూ నవ్వులాట ఆడుకున్నారు. అయితే కొటియా గ్రామాలకు విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు దినదిన గండంగా మారుతోంది. ఎపి ఉద్యోగులు కొటియా గ్రామాల్లో అడుగు పెట్టిన ప్రతిసారీ ఒడిశా అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఫ్యామిలీ కాన్సెప్ట్‌ లో భాగంగా తోణాం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ అక్కేన అజరు తన సిబ్బందితో కలిసి కొటియా గ్రామం పణికి వెళ్తుండగా కొటియా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు స్టేషన్‌ ముందు రెండు గంటల పాటు నిలబెట్టించారు. కొటియా గ్రామాల వివాదానికి పరిష్కారం చూపకుండా ఎపి, ఒడిశా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ఉద్యోగులను అడ్డుకోవడం, వాగ్వాదానికి దిగడం పెద్ద తలనొప్పిగా మారింది. ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో భాగంగా కొటియా గ్రామాల్లో పర్యటించడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు.