ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్‌కు మద్దతుగా వందలాది మంది ముస్లింము మైనార్టీలు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ, వైస్ ఛైర్మన్ జబివుల్లా, కౌన్సిలర్లు, వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వాల్మికీ లోకేష్‌తో పాటు ఇక్బాల్ మద్దతుదారులు ఆదివారం ''జయహో ఇక్బాల్.. జయహౌ జగన్'' అంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక అల్ హిలాల్ పాఠశాల ఆవరణం నుంచి సద్బావన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా తిరిగి అల్ హిలాల్ పాఠశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు ఇక్బాల్‌కు మద్దతుగా అంబేద్కర్ సర్కిల్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కుల మతాలకు అతీతంగా అందరికీ తోడుగా ఉన్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నియోజక వర్గంలో 3 మండలాల్లో 3 ఎంపిపిలు, 3 జడ్పిటిసిలను గెలిపించి క్లీన్ స్వీప్ చేశారన్నారు. దీంతో పాటు పురపాలక సంఘంలో 30 మంది కౌన్సిలర్లను, నియోజకవర్గంలో 30 స్థానాలను సర్పంచిలను గెలిపించారన్నారు. అయితే అధిష్టానం ఇక్బాల్‌కు కాకుండా వేరొకరిని తెరపైకి తీసుకురావాడం తగదన్నారు. ఇక్బాల్‌కు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జామీయ మసీదు కమిటీతో పాటు వివిధ మసీదుల ముతవల్లీలు, తదితరులు పాల్గొన్నారు.










