అనంతపురం ప్రతినిధి : హిందూపురం వైసిపి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో దీపికారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ ప్రకటన జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో మహమ్మద్ ఇక్బాల్‌కు హిందూపురం ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చారు. టిడిపి కంచుకోట అయిన హిందూపురంలో ఆయన విజయం సాధ్యపడలేదు. అప్పటి నుంచి ఆయనే ఇన్‌ఛార్జిగా ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ఇక్బాల్‌కు వెంటనే ఎమ్మెల్సీ పదవినిచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉంటూ వచ్చారు. అయితే ఇక్బాల్‌కు స్థానిక నాయకులు కొంత మందికి పడటం లేదు. విభేదాలు బాహాటంగానే పలుమార్లు జరిగాయి. ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి హత్య జరగడం నేరుగా ఇక్బాల్‌పైనే పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. స్థానిక నాయకులు కొంత మంది అధిష్టానానికి, జిల్లా పార్టీ ఇన్‌ఛార్జీగానున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తప్పిస్తున్నారన్న ప్రచారం చాలాకాలంగా సాగుతూ వచ్చింది. ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశానికి ఇక్బాల్‌కు ఆహ్వానించకుండా దీపికారెడ్డిని ఆహ్వానించారు. అప్పుడే కొత్త పేరు తెరపైకి ఇచ్చింది. దీపికారెడ్డి పేరు అనుహ్యంగా రావడం తిరుపతి సమావేశానికి పిలిపించడంతో చర్చనీయాంశం అయ్యింది. ఈమె పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతోపాటు, ఇప్పుడు హిందూపురం పార్టీ సమన్వయకర్తగానూ నియమించడంతో ఆమె ఎవరు.? ఏ రకంగా తెరపైకి వచ్చిందన్న చర్చ సాగుతోంది. భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆమె మాత్రం బిసి సామాజిక తరగతికి చెందినది. భర్త వ్యాపారవేత్త కాగా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ఆమె తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈమెకు స్థానికంగా ఏ మేరకు మద్దతు లభిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే దీపికారెడ్డి కూడా ముందు నుంచి పార్టీలో చురుగ్గా పాల్గొన్న దాఖలాల్లేవు. బయటకు నుంచి ఉన్నఫలంగా రాజకీయ అరంగేట్రం చేయడంతో స్థానిక నాయకులను ఈమె ఏ మేరకు సమన్వయం చేసుకోగలరన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. వైసిపిలో హిందూపురం నియోజకవర్గంలో ముందు నుంచి గ్రూపు తగాదాలున్నాయి. రెండు, మూడు గ్రూపులుగా రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఈ గ్రూపులను కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన దీపికారెడ్డికి సహకారం ఏ రకంగా అందుతున్నది సందేహస్పాదంగనానే ఉందని చెప్పవచ్చు. అది కూడా మైనార్టీలు అధికంగానున్న ఈ నియోజకవర్గంలో మైనార్టీ నాయకుడుగానున్న మహమద్ ఇక్బాల్‌ను కాదని దీపికారెడ్డిని తీసుకొచ్చారు. మార్పు జరుగుతుందని తెలిసినప్పటి నుంచే మహమ్మద్ ఇక్బాల్‌కు టిక్కెటు వచ్చే ఎన్నికల్లో ఖరారు చేయాలని మైనార్టీ నాయకులు హిందూపురం పట్టణంలో ప్రనదర్శనలు నిర్వహించి, మద్దతు తెలిపారు. ఈ సమయంలో ఆయన కాదని కొత్త వారికిస్తే వారి మద్దతు ఏ మేరకు దీపికారెడ్డికి ఉంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లోనూ నడుస్తోంది. అది కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగానన్న హిందూపురంలో ఈ మార్పు వైసిపికి ఏ మేరకు దోహదపడగలలదన్నదీ ప్రశ్నార్థకమే. పార్టీలోని గ్రూపు తగాదాలకు పుల్‌స్టాప్ పెట్టే చర్యలు కాకుండా నాయకత్వాన్ని మార్చినంత మాత్రానా ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.










