హిందూపురం: జిల్లాలో ఉండే ఒకే ఒక ఈఎస్‌ఐ ఆసుపత్రిలో తగినంత వైద్య సిబ్బంది లేక కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదని, వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి అవసరమైన మందులు సరఫరా చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జడ్పీ శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి నరసింహప్ప మాట్లాడుతూ ఈఎస్‌ఐ హాస్పిటల్ పరిధిలో దాదాపు 40 వేల మంది కార్మికులకు వైద్య సేవలందాలన్నారు. హిందూపురం చుట్టుపక్కల ఉన్న మండలాల్లో వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు వారి వేతనాల నుంచి ప్రతి నెలా ఈఎస్‌ఐ చెల్లిస్తున్నప్పటికీ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో 19 మంది సిబ్బందికి గాకూ ఆరుగురు మాత్రమే ఉన్నారన్నారు. వారు కూడా సక్రమంగా పనిచేయటం లేదని ఆరోపించారు. దీనికి తోడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకుని దానికి సంబంధించిన బిల్లులను కార్మికులు ఈఎస్‌ఐ అధికారులకు సమర్పిస్తే, 6 నెలలు గడిచినా మంజూరు చేయడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఈఎస్‌ఐ కార్డు ఉన్నవారికి వైద్య సేవలు అందించడం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమేనని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అప్పటికీ పరిష్కరించకపోతే ఆసుపత్రి ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామన్నారు. అనంతరం ఈఎస్‌ఐ వైద్య సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రీ కాట్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారి నందీష్, నాగభూషణ్, రామకృష్ణ, జి.మారుతిరెడ్డి, హిందూపురం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి జగదీష్, మంజునాథ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.










