ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందూపురంలో ఉన్న ఇఎస్‌ఐ అసుపత్రికి జబ్బుచేసింది. రెండేళ్లుగా ల్యాబ్‌కు అవసరమైన కెమికల్స్, కిట్స్ సరఫరా చేయక పోవటంతో ల్యాబ్ మూత పడింది. 406 రకాల మందులు పంపిణీ చేయాల్సుంటే కేవలం 50 రకాల మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పోనీ సరిపడా వైద్యులున్నారా అంటే అదీ లేదు. ఇక దీర్ఘకాలిక రోగుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. బిపి కోసం 8 రకాల మందులు రావాల్సి ఉంటే 2 రకాలు, షుగర్ కోసం 6 రకాల మాత్రలు రావాల్సి ఉంటే మూడు రకాలు మాత్రలు సరఫరా చేస్తున్నారు. దీంతో కార్మికులు బయట మార్కెట్‌లో మందులు కొనుగోలు చేసే స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురంతో పాటు హిందూపురంలో రెండు, గుంతకల్లు, తాడిపత్రిలో ఇఎస్‌ఐ ఆస్పత్రులు ఉన్నాయి. ఇక్కడ రోజూ సుమారు 500లకు పైగా కార్మికులు వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే జిల్లాలో ఎక్కడా లేని విధంగా హిందూపురం ఇఎస్‌ఐ అసుపత్రిలో ఎక్కువ మంది వస్తుంటారు. హిందూపురం ప్రాంతంలో దాదాపు 20 వేల మంది కార్మికులకు పైగా ఉన్నారు. ఒక్కో కుటుంబంలో నలుగురు సభ్యులను కలుపుకుంటే మొత్తం సభ్యుల సంఖ్య సుమారు 80వేలకు చేరుకుంటుంది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆయా సంస్థలు తమ ఇఎస్‌ఐ వాటాను ప్రభుత్వానికి ప్రతి నెల చెల్లిస్తోంది. ఇఎస్‌ఐ అసుపత్రిలో కార్మికుల కుటుంబ సభ్యులకు ఇఎస్‌ఐ డిస్పెన్సరీ, ప్యానెల్ క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తుంటారు. కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురానికి ఇఎస్‌ఐ జాయింట్ ప్రాంతీయ కార్యాలయం కడపలో ఉంది. 28 డిస్పెన్సరీలు ఆదోని, తిరుపతిలో ఆస్పత్రులు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నాయి. వైద్యుల లెక్క ప్రకారం ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు ఒక్కో దానికి రోజుకు 100 నుంచి 150 మంది ఇఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులు చికిత్స కోసం వస్తుంటారు. డిస్పెన్సరీలకు అవసరమైన మందుల ఇండెంట్‌ను కడప జేడీ కార్యాలయం నుంచే విజయవాడ కార్యాలయానికి పంపిస్తుంటారు. ఏయే మందులు అవసరమో వాటిని అక్కడి నుంచి డిస్పెన్సరీలకు సరఫరా చేస్తారు. హిందూపురంలో పాటు అనంతపురం, కర్నూల్, కడప జిల్లాలకు ఆదోనిలో ఉన్నా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు సరఫరా అవుతాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో మందులు సరఫరా కావటం లేదు.
వేధిస్తున్న మందుల కొరత
మందులు సరఫరా చేసే కంపెనీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంతో ఆయా కంపెనీలు ఇఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులను సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. మూడు నెలలకు ఓసారి ఆస్పత్రులకు అవసరమైన మందుల ఇండెంట్‌ను జేడీ ద్వారా విజయవాడలోని డైరెక్టర్‌కు పంపిస్తుంటారు. 406 రకాల మందులను డాక్టర్లు ఇండెంట్ పెడుతుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల మందులతో పాటు బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, గుండె సంబంధిత తదితర వ్యాధులకు సంబంధించి మందులు తెప్పిస్తుంటారు. అయితే ప్రభుత్వం కంపెనీలకు పాత బకాయిలు ఇవ్వకపోవడంతో మందుల సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. 406 రకాల మందులకు గాను ఇప్పుడు కేవలం 50 రకాలు మాత్రమే వస్తున్నాయి. కార్మికులు నిత్యం వాడే బిపి, షుగర్, థైరాయిడ్ లాంటి రోగాలకు సైతం పూర్తి స్థాయిలో మందులు రావడం లేదు.
మూతపడ్డ ల్యాబ్
హిందూపురం ఇఎస్‌ఐ అసుపత్రిలో ఉన్న రక్త పరీక్షల విభాగంలో టెక్నిషియన్ ఉన్నారు. అయితే ల్యాబ్‌కు అవసరమైన కెమికల్స్, కిట్స్ సరఫరా కాకపోవటంతో ల్యాబ్ రెండేళ్లుగా మూత పడింది. అధునాతన యంత్రాలతో దాదాపు 20 రకాల రక్త పరీక్షలను ఇక్కడ నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం హెచ్‌బి పరీక్ష మాత్రమే చేస్తున్నారు. రోగ నిర్దారణ అయిన అనంతరమే వైద్యులు రోగులకు వైద్య సేవలను అందిస్తారు. అయితే రోగ నిర్దారణ కోసం కార్మికులు వేలాది రూపాయలు చెల్లించి బయట ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించుకుని వస్తే తప్ప ఇక్కడ వైద్యం అందడం లేదు.
మందులే కాదు సిబ్బంది సైతం లేరు...
హిందూపురం ఇఎస్‌ఐ అసుపత్రిలో ముందులే కొరతే కాదు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. హిందూపురం, కొట్నురు రెండు డిస్పెన్సిరీలు ఒకే చోట నిర్వహిస్తున్నారు. ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికి నర్సింగ్, ల్యాబ్ టెక్నిషియన్, ఎంఎన్‌ఒతో పాటు క్లాస్-4కు సంబందించి అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు కార్యాలయంలో ఉండాల్సి సీనియర్ అసిస్టెంట్లు సైతం లేరు. దీంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు.
కార్మికులకు భారంగా వైద్యం
చాలా మంది కార్మికులు అరకొర వేతనాలు, సంపాదనతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వారిలో ఎవరికైనా ఏదైనా జబ్బుచేస్తే ఇఎస్‌ఐ కార్డుతో చికిత్స చేయించుకోవచ్చనే భరోసా కార్మిక కుటుంబాలకు ఉంటుంది. కార్మికులతో పాటు పిల్లలు, తల్లిదండ్రులకు ఉపయోగంగా ఉండేది. అయితే ఇఎస్‌ఐ డిస్పెన్సరీలో కూడా మందులు కొరత ఉండడం కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు, ఇంజెక్షన్ల కోసం నెలకు సుమారు రూ.2 నుంచి రూ.3 వేల విలువ చేసే మందులను ఉపయోగిస్తుంటారు. వీరు క్రమం తప్పకుండా రోజూ మందులు వేసుకోవాల్సుంటుంది. అయితే ఇప్పుడు ఇఎస్‌ఐలో మందుల కొరత కారణంగా బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిరావడం కార్మికుల కుటుంబాలకు భారంగా మారుతోంది. ఇక్కడ సరైన వైద్యం అందక పోవడంతో ఇతర అసుపత్రుల్లో వైద్య సేవలు పొందితే దానికి సంబందించిన బిల్లులు ఆరు నెలలు గడిచిన మంజూరు కావడం లేదు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ అసుపత్రుల్లోవిఎస్‌ఐ కార్డు ఉన్నా వారికి వైద్య సేవలు అందించమని తెగేసి చెబుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దీనికి కారణం ఇఎస్‌ఐ వైద్య సేవలకు సంబందించి సకాలంలో బిల్లులు మంజూరు కాక పోవడమేనని తెలుస్తోంది. ప్రతి నెల కార్మికులు ఇఎస్‌ఐ కోసం డబ్బులు చెల్లించినప్పటికి వైద్య సేవల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.
సౌకర్యాలు మెరుగుపర్చాలి
జిల్లాలో కార్మికుల కోసం ఉండే ఒకే ఒక అసుపత్రి ఇఎస్‌ఐ అసుపత్రి. ఈ అసుపత్రిలో మందులే కాదు..సిబ్బంది సైతం లేక కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదు. వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి అవసరమైన మందులను సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే రక్త పరీక్షల కోసం అవసరమైన కెమికల్స్, కిట్స్‌ను సరఫరా చేసి ల్యాబ్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. లేని పక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్దం అవుతాం.
ఇఎస్ వెంకటేష్,
సిఐటియు జిల్లా కార్యదర్శి










