May 13,2023 22:03

వివరాలు వెల్లడిస్తున్న ఇఎపిసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన్‌

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జేఎన్టీయూ, ఎపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర, ఫార్మాసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఈఏపీ సెట్‌ -23) ఈనెల 15 నుండి 19 వరకు, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు 22 నుండి23 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి, ఈఏపీ సెట్‌ చెర్మన్‌ ఆచార్య రంగజనార్ధన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానికి వర్శిటీ ఉపకులపతి కాన్ఫరెన్స్‌ హల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అందుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. శనివారం వరకు ఈఏపీసెట్‌ పరీక్షలకు 3,37,733 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు, ఇందులో ఇంజనీరింగ్‌ కు 2,71,193 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశానికి 99,557 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ రెండింటికీ కలిపి 983 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రవేశపరీక్షలకు గాను ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 136 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పరీక్ష కేంద్రాలనే 97 శాతం కేటాయించామన్నారు. ఉదయం, సాయంత్రం జరిగే ఈ పరీక్షలకు ఒక్కో సెషన్‌ 27 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్‌ చేసుకుంటున్నారన్నారు. అందులో కేటగిరీలు, గ్రూపులు తదితర వాటిలో ఏమైనా తప్పులు ఉంటే ఈఏపీసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు సంప్రదించాలని ఆయన కోరారు. ఇక పరీక్ష హాలుకు గంటన్నర ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో ఇన్‌విజిలేటర్‌ చెప్పే సూచనలు తప్పక పాటించాలన్నారు. విద్యార్థులు పరీక్ష హాలు లోకి కేవలం హల్‌ టికెట్‌, బ్లూ,బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ మాత్రమే తీసుకెళ్లాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి కేటగిరీలకు సంబందించి గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లి సమర్పించాల్సుంటుందన్నారు. అలా చేయని విద్యార్థులు ఫలితాలు హోల్డ్‌లో పెడతామని చెప్పారు.
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు బస్సులు నడపాలని రీజనల్‌ మేనేజర్లకు, కలెక్టర్లుకు సమాచారం ఇచ్చామన్నారు.ఈకార్యక్రమంలో ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య శోభాబిందు, రిజిస్టార్‌ శిశిధర్‌, భానుమూర్తి, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.