ప్రజాశక్తి - చిలమత్తూరు : ఆదివారం సాయంత్రం వీచిన గాలివానకు మండల పరిధిలో పలు గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది. మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన రైతు రామక్రిష్ణా రెడ్డికి చెందిన 2 ఎకరాల మేర అరటి తోట నేలకొరిగింది. దీంతో తనకు 2లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు రామక్రిష్ణారెడ్డి వాపోయారు. విషయం తెలసుకున్న వీఆర్వో శ్రీనివాసులు,అగ్రికల్చర్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పంటనష్టం అయిన పొలాన్ని పరిశీలించారు. పంట చేతికందే సమయంలో ఊహించని నష్టం కలగడంతో రైతు రామక్రిష్ణా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.
ధర్మవరం టౌన్ :మండలంలోని రేగాటిపల్లిలోని రైతు చిలకం సూర్యనారాయణరెడ్డికి చెందిన అరటిపంట ఈదురుగాలులకు నేలకొరిగింది. దీంతో అరటిపంట పూర్తిగా కోల్పోయి దాదాపు రూ.5లక్షలకు పైగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు సూర్యనారాయణరెడ్డి గత నాలుగేళ్ల నుండి నష్టాలను చవిచూస్తున్నాడు. న్నో వ్యవప్రయాసాలకోర్చి లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టి మంచి దిగుబడులు సాధించినా పంట చేతికి వచ్చేసరికి ఏదో రూపంలో నష్టపోతున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే రూ.15 లక్షల దాకా నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. గత ఏడాది అరటి, దోశవంటిపంటలు సాగుచేయగా మంచి దిగుబడుల సమయంలో తెగుళ్లు సోకి చివరికి పంటను వదిలేయాల్సి వచ్చింది. అప్పట్లో రూ.7లక్షల దాకా నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ సారైన మంచి దిగుబడులు సాధించి చేసిన అప్పులు తీర్చాలని శ్రమించి అందుకు తగ్గ దిగుబడులు తీసుకువచ్చినప్పటికి మరో నెలలో కోత దశకు వస్తుందన్న అరటిపంట ఆదివారం రాత్రి ఈదురుగాలులకు నేలకొరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.










