ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : మండల పరిధిలోని ఆర్. యర్రగుంటపల్లి తండాలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలులకు గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, రేకుల షెడ్లు నేలకొరిగాయి. ఏమి జరుగుతుందోనని తండా వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ స్తంబాలు ఇళ్లపై పడ్డాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తండా వాసులు తెలిపారు. ఈ విషయం తెలియగానే రెవిన్యూ సిబ్బంది గ్రామంలో పర్యటించి జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నారు. నష్టపోయిన తమను అధికారులు ఆదుకోవాలని తండా వాసులు రెవిన్యూ అధికారులను కోరారు
కొత్తచెరువు : గురువారం రాత్రి వడగళ్ల వాన, గాలి రావడంతో మండలంలో పలునష్టం జరిగింది. మండల కేంద్రంలో ని నాలుగురోడ కూడలిలో ఫ్లెక్సీలు విద్యుత్ మెయిన్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నాగులకనుం వద్ద మైలేపల్లి లో చెట్లు పడడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిఐ జయనాయక్, ఎస్‌ఐ లింగన్న రోడ్డుపై పడిన చెట్లను జెసిబి లతో సాయంతో తొలగించారు.










