హెచ్చరిస్తున్న సహాయ కమిషనర్ వాణి
ప్రజాశక్తి - కౌతాళం
శ్రావణమాస ఉత్సవాల్లో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని సహాయ కమిషనర్ వాణి హెచ్చరించారు. మంగళవారం కల్యాణ కట్టలో కేశఖండన కార్మికులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు గుండు గీయడానికి రూ.వంద వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈరన్న స్వామి భక్తులకు సేవలు అందించాలని, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు మంచి సేవలు అందించి, పుణ్యక్షేత్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అధిక ధరలతో భక్తులను నిలువు దోపిడీకి గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూపరింటెండెంట్లు రామ్మోహన్, వెంకటేష్, మల్లికార్జున పాల్గొన్నారు.










