మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? మీరు పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడుతున్నారా? అయితే వెంటనే అప్డేట్ అవ్వండి. లేదంటే మీ మొబైల్లో ఇక వాట్సాప్ ఏ మాత్రమూ పనిచేయదు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత గోప్యత (డేటా ప్రైవసీ) కోసం ఇప్పటికే ఎన్క్రిప్టెడ్ చాటింగ్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత ఫోన్లలో తన సేవలను నిలిపివేయాలని వాట్సాప్ భావిస్తోంది. త్వరలోనే ఈ ఫోన్లలో వాట్సాప్ తమ సేవలను నిలిపివేసే అవకాశం ఉంది.
ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు?
- ప్రస్తుతం ఐఒఎస్లో వాట్సాప్ 2.21.50 వెర్షన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఐఫోన్ 4ఎస్ వాడుతున్నట్లయితే ఇది మీ యాప్ స్టోర్‌లో కనిపించదు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఐఫోన్ 4ఎస్ తర్వాత మొబైల్స్ ఉండాలి.
- అదే ఐఫోన్ 5 దాని తర్వాత మోడల్స్ ఉపయోగించినట్లయితే మీ ఐఓఎస్10కు అప్డేట్ చేసుకోవాలి. ఐఓఎస్ 9 దానికంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ (ఒఎస్) ఉంటే మీ మొబైల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.
- ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో అయితే 4.0.3 ఒఎస్ కంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అంటే శాంసంగ్ గేలాక్సీ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ గేలాక్సీ నోట్ 10.1, శాంసంగ్ గేలాక్సీ నెక్సస్, హెచ్‌టిసి వన్ వి, హెచ్‌టిసి డిసైర్ సి, హెచ్‌టిసి డిసైర్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా టేబుల్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా నియో సహా పలు ఫోన్లలో ఆండ్రాయిడ్ ఒఎస్ 4.0.3 అంతకంటే పాత వర్షన్ ఒఎస్ ఉంది. కాబట్టి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
- కెఎఐ ఒఎస్ 2.5.1 అంతకంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఈ ఒఎస్ జియో ఫోన్, జియో ఫోన్2లో ఉంది.
మీ మొబైల్ ఓఎస్ వర్షన్ ఇలా తెలుసుకోండి..
- ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్ ఫోన్‌పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
- ఐఫోన్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌పై క్లిక్ చేస్తే ఎబౌట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫోన్ వివరాలు తెలుస్తాయి.
పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ పని చేయకపోవడం కొత్తేమీ కాదు. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. పాత ఐఒఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో తమ సేవలను వాట్సాప్ నిలిపివేస్తుంది. 2020 ఏడాది ఆరంభంలో యాండ్రాయిడ్ ఆధారిత 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్ అంతకన్నా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేసే ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేసింది. అదే ఐఫోన్ విషయానికి వస్తే.. ఐఒఎస్ 8, అంతకన్నా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడిచే ఫోన్లలో వాట్సాప్ ఆగిపోయింది. పాత వెర్షన్ ఫోన్లలో కొత్తగా అకౌంట్లు క్రియేట్ చేయలేరు, అంతేకాదు.. అప్పటికే ఉన్న అకౌంట్‌ను రీ వెరిఫై చెయ్యలేరు అని వాట్సాప్ చెబుతుంది.










