May 07,2023 20:47

అమ్మకానికి సిద్దంగా ఉంచిన మామిడి పండ్లు

ప్రజాశక్తి-హిందూపురం : పక్వానికి రాకముందే పండ్లను కృత్రిమంగా మగ్గించేందుకు రసాయనాలను యథేచ్చగా వాడుతున్నారు. ఇలా మగ్గిన పండ్లను తింటే క్యాన్సర్‌, జీర్ణకోశ వ్యాధులు, మూత్రపిండాలు దెబ్బతింటాయని పలువురు వైద్యపరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉ ంచుకొని కృత్రిమంగా పండ్లను మగ్గిపెట్టే పక్రయకు బ్రేక్‌ వేయాలని హైకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రసాయనాలతో మగ్గిస్తే రూ.1లక్ష జరిమానాతోపాటు ఐదు సంవత్సరాలు జైలుశిక్ష విధించేలా నిర్ణయించింది. అయితే హై కోర్టు ఆదేశించినప్పుడు అధికార యంత్రాంగం వారం పదిరోజులు హడావుడి చేసింది. రసాయనాలతో మగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీలు చేసి కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. వ్యాపారులకు రూ.10వేల నుంచి రూ.20వేలు అపరాధ రుసుం విధించారు. తర్వాత పరిస్థితి షరామామూలే అయింది.
ఉమ్మడి జిల్లాలో 1.22 లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగవుతున్నాయి. రైతులు పండించిన కాయలు పక్వానికి వచ్చినప్పుడుకోత కోసిన కాయలను వారికి అనుకూలంగా ఉన్నట్లయితే బోదగడ్డి, వరిగడ్డి లేకర్లుగా వేసి మాగించే విధానాలు పాటించాలి. రైతులకు అనుకూలంగా లేకపోతే కాయలను మగ్గించేందుకు ప్రభుత్వమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు రైఫనింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. అనంతపురం మార్కెట్‌ యార్డులో పండ్లు మగ్గించేందుకు మూడు ఛాంబర్స్‌ ఉన్నాయి కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం, మార్కెట్‌యార్డులలో ఒక్కొక్క కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఈ విధానంతో పండ్లను మగ్గిస్తే ప్రజలకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తవు. రైతులు పండించిన ఉద్యాన ఉత్పత్తులు మామిడి, సపోటా, అరటి, కర్బూజా, పైనాపిల్‌, బొప్పాయి వంటి వాటికి మగ్గించేదుకు ఈ కేంద్రాలను వినియోగించుకొనే అవకాశాలున్నాయి. కాయలను కోసినప్పుడే పక్వానికి వచ్చిన సమయంలో కోత కోసుకునే విధంగా ఆ శాఖ అధికారులు సలహాలను ఇస్తున్నారు. అవేవి తమకు పట్టవనే ధోరణిలో వ్యాపారులు కొత్త ఫలాలను మార్కెట్‌లోకి తెచ్చి సొమ్ము చేసుకొనే రీతిలో వ్యవహరిస్తున్నారు. కోసిన వాటిని అమ్మిసొమ్ము చేసుకొనేందుకు రసాయనాలు వాడుతున్నారు. పకృతి వైపరీత్యాలు కారణంగా ప్రస్తుత పరిస్థితులలో గాలివానలకు పండ్లతోటలు దెబ్బతింటున్నాయి. గాలి వానలకు నేలరాలిపోయిన కాయలను వ్యాపారులు తక్కువ ధరకు కొని వాటికి రసాయనాలు వాడి మగ్గేలా చేస్తున్నారు.
మన ప్రాంతాల్లో పండే పండ్లతో పాటు ఇతర ప్రాంతాలలో పండే పండ్లను తెప్పించి రసాయనాల ద్వారా మగ్గిస్తున్నారు. కాశ్మీర్‌నుంచి అట్టపెట్టెల్లో ఆపిల్స్‌ బెంగళూరుకు వస్తాయి. వాటిని కోనుగోలు చేసుకొని గోడౌన్లలోఉంచుతారు. ఆ పెట్టెలలో చిన్న కార్బెడ్‌ ముక్క ఉంచి గాలి లోపలికి వెళ్లకుండా చేసి గోడౌన్లలో ఉంచుతారు. 24 గంటల తరువాత ఆపిల్‌ పెట్టెను తెరిస్తే కాయలు ఆకర్షణీయంగా మంచి రంగుతో కన్పిస్తాయి. మన రాయలసీమ ప్రాంతాల్లో లభించే మామిడి కాయలకు ఇదే పద్దతే అనుసరిస్తారు. కర్బూజ, బొప్పాయి వంటి వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. దాదాపు చాలా రకాల పండ్లను ఇలా కృత్రిమంగానే మగ్గిస్తున్నారు. పక్వానికి రాని కాయలను కోసి ఒక్క రోజులోనే పండ్లుగా మార్చే హడావుడిలో హోల్‌సేల్‌ వ్యాపారులు కృత్రిమ పద్దతులు పాటిస్తున్నారు. కార్బెడ్స్‌ ముక్కలను కాగితంలో పొట్లాలుగా కట్టి పండ్ల మధ్యలో పెడితే అవి మగ్గిపోతాయి. అరటి పరిస్థితి అంటే కార్బెడ్స్‌ అనే రసాయనాన్ని నీటి డ్రమ్ములతో కలిపి అందులో గెలలు మునగనిచ్చి వాటిని గోడానులో వుంచితే అవికూడా మంచి రంగుతో పండి పోతాయి. ఇలా అన్ని రకాల పండ్లను హానికర రసాయనాలతోనే మగ్గిస్తున్నారు. కార్బేడ్స్‌ నిషేధిత రసాయనమైనా పండ్ల వ్యాపారులకు మార్కెట్‌లో యథేచ్భగా లభిస్తుండటం గమనార్హం.
ఈ పండ్లుతింటే రోగాలే....
రసాయనంతో మగ్గిస్తున్న పండ్లను తింటే క్యాన్సర్‌, మూత్రపిండ, జీర్ణకోశ తదితర వ్యాధుల బారిన పడతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్ని తెలిసినా కంటికి ఇంపుగా కనిపిస్తే చాలా కొనుక్కొని తింటున్నాం. తనిఖీ అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంఉటన్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న వ్యాపారుల మీద సరైన చర్యలు తీసుకోకపోవటంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు పెడితే వచ్చేలాభం ఏముందన్న ధోరణితో కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకొని వెళుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.
నిర్లక్ష్యపు నీడన అధికారులు
రసాయనాలతో పండ్లను మాగించే వారిపై వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు, సీనియర్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు కేసులుపెట్టే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. రసాయనాల ద్వారా పండ్లు మగ్గిస్తే ఏడాది పాటు జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. రెవెన్యూ, పోలీసులు సైతం పండ్లను రసాయనంతో మగ్గిస్తే కేసులు పెట్టవచ్చు. అయినప్పటికి శాఖల మధ్య సమన్వయ లోపంతో, పండ్ల వ్యాపారులపై ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు అందరు కలిసి ఒక్కసారిగా పండ్ల వ్యాపారులపై తనిఖీలు ముమ్మరం చేస్తే పెద్ద మాఫియా బయట పడుతుంది.