అనంతపురం ప్రతినిధి : ఈ-బిడ్ మోసంపై కదలిక మొదలైంది. ఈ పేరుతో 2021లో పెద్దఎత్తున వందల కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణను సిఐడి వేగవంతం చేసినట్టు సమాచారం. డబ్బుల లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణను కొనసాగిస్తోంది. ఎక్కడికెక్కడికి డబ్బులు బదిలీ అయ్యాయన్న దానిపై నిఘా పెట్టారు. దీనికై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అన్వేషణ మొదలుపెట్టింది. దీంతో ఈ కేసులో కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది.
లక్షకు రూ.30 వేలు ఆదాయమని నమ్మబలికి
లక్షకు రూ.30 వేలు ఆదాయం వస్తుందని నమ్మబలికి వందల కోట్లలో డబ్బులు వసూలు చేసి బోర్డును ఈ బిడ్ సంస్థ తిప్పేసింది. 2021వ సంవత్సరంలో ఈ రకమైన మోసం జరిగింది. ఆదాయం ఎక్కువగా వస్తుందని ఆశించి పెద్దమొత్తంలో డబ్బులను ఆ సంస్థ ప్రతినిధులకు చెల్లించారు. బయట అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఒక్క ధర్మవరం ప్రాంతంలోనే కొట్లాది రూపాయలు ఇందులో పెట్టారు. ధర్మవరంతో పాటు అనంతపురం నగరంలోనూ ఉద్యోగులు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టారు. ఈ రకంగా పెట్టుబడులు పెట్టిన వారిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించిన ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ధర్మవరం, అనంతపురం ప్రాంతాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక పరమైన మోసం జరగడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. వందల కోట్లు ఇందులో ఉండటంతో కేసును సిఐడికి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ అంత వేగంగా ముందుకు సాగలేదు.
విచారణ వేగంతం
విచారణ ప్రస్తుతం వేగవంతమైనట్టు కనిపిస్తోంది. సిఐడి అధికారులు దేశంలో వివిధ ప్రాంతాలకు విచారణ నిమిత్తం వెళ్లారు. నాగపూర్, ఢిల్లీ, పుణేల్లో కార్యాలయాలకు వెళ్లారు. అక్కడ కార్యాలయాలున్నట్టు అప్పట్లో సమాచారం ఉండటంతో వివరాల సేకరించేందుకు సిఐడి బృందాలు వెల్లినట్టు సమాచారం. అక్కడి నుంచి బ్యాంకు ఖాతాలు ఆపరేట్ చేసినట్టు తెలియడంతో, ఆ వివరాలను సేకరిస్తున్నారు. ఏ ఖాతాలో నుంచి ఎక్కడికి డబ్బులు మారాయన్న వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది తేలాక అసలు నిందితులపై చర్యలుండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
బాధితులకు ఊరట లభించేనా ?
తక్కువ సమయంలో లాభాలు వస్తాయన్న ఆశతో పెద్ద సంఖ్యలో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. అప్పులు చేసి మరీ పెట్టారు. పెద్ద మొత్తంలో నష్టపోయిన బాధితులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆర్థికపరమైన నేరం కావడంతో విచారణ అనుకున్నంత వేగంగా సాగడం లేదు. సిఐడికి ఇచ్చినా విచారణ నెమ్మదిగా సాగుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడూ దాని లోతుల్లోకి సిఐడి దిగుతుండటంతో పూర్తి స్థాయి డొంక కదిలితే కేసులో కదలిక వచ్చే అవకాశముంది. వచ్చి డబ్బులు కొంత వరకైనా బాధితులకు అందుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రివకరీ కొంత వరకైనా బాధితులకు ఎంతో ఊరట లభించే అవకాశముంది.










