Aug 17,2021 11:07

సంగారెడ్డి (హైదరాబాద్‌) : ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ టెలిస్కోప్‌ను గత సోమవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టి) స్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ బిఎన్‌ సురేశ్‌ ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్‌ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటి కాన్పూర్‌ తర్వాత రెండోది) ఆప్టికల్‌ వ్యాసం కలిగిన భారీ లెన్స్‌ ఉంటుందని ఐఐటి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
    హైదరాబాద్‌ ఐఐటి డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ మూర్తి మాట్లాడుతూ... ఖగోళంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఈ టెలిస్కోప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్‌లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను గుర్తించేందుకు ఈ టెలిస్కోప్‌ను వాడుకోవచ్చని చెప్పారు. స్టార్‌ గేజింగ్‌ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు, తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని అన్నారు. ఐఐటి హైదరాబాద్‌ ఆస్ట్రానమీ క్లబ్‌ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ఈ టెలిస్కోప్‌ సాయంతో ప్రయోజనాలు పొందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ ముయూఖ్‌పహారి పాల్గన్నారు.

.