న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా అనుమానాస్పద మృతి కేసు వీడింది. ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బంగ్లాను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయని.. ఇదే న్యాయవాది హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా, తన భర్త నితిన్ నాథ్ సిన్హా తో కలిసి నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు. అయితే రెండు రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. రేణు సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు లాయర్ బంగ్లాలో వెతకగా.. బాత్రూమ్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.
అయితే ఆమె భర్త నితిన్ ఆచూకీ లభించలేదు. నితిన్ ఫోన్ నంబర్ ట్రాక్ చేయగా.. అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. దీంతో పోలీసులు బంగ్లా మొత్తం వెతకగా.. స్టోర్‌రూమ్‌లో నితిన్ కనిపించాడు. నితిన్ తన భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటల పాటూ స్టోర్‌రూమ్‌లోనే దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల నితిన్ బంగ్లాను విక్రయించి .. కొనుగోలు దారుడి నుండి నగదు మొత్తాన్ని తీసుకున్నాడని అన్నారు. అయితే రేణు సిన్హా బంగ్లా విక్రయించేందుకు సిద్ధంగా లేరని, ఈ విషయంపై వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని పోలీసులు వెల్లడించారు.










