- కుకీ శిబిరాలలో అరకొరగానే ఆహారం
- సరఫరాలను దోచుకుంటున్న మైతీలు
- కొండెక్కి కూర్చున్న నిత్యావసరాల ధరలు
ఇంఫాల్ : మణిపూర్‌లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలతో సహాయ శిబిరాలలో తలదాచుకుంటున్న కుకీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రేషన్ సరుకులు తెచ్చుకోవడం కూడా గగనమవుతోంది. చురాచాంద్‌పూర్, తెంగ్‌నౌపాల్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఏ సహాయ శిబిరాన్ని దర్శించినా కన్నీటి గాథలు, ఆకలి కేకలు విన్పిస్తున్నాయి.
అది కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చురాచాంద్‌పూర్‌లోని ఓ సహాయ శిబిరం. ఏడు నెలల గర్భిణి తెతియమ్ చిందరవందరగా పడి ఉన్న పాత బట్టల మధ్య ఓ హాలులో కూర్చొని ఉంది. ఆమె స్వగ్రామమైన సుగ్నూ మే 27న హింసాకాండలో అగ్నికి ఆహుతైంది. అప్పటి నుంచీ తెతియమ్ ఈ శిబిరంలోనే కాలం గడుపుతోంది. అత్యవసర మందుల కోసం రోజూ యంగ్ వైపై అసోసియేషన్ నడుపుతున్న సహాయ కేంద్రానికి వెళుతున్నా, ఆమె ఆశలు అడియాసలే అవుతున్నాయి. సహాయ శిబిరాలలో ఆహారం పరిమితంగానే అందుతోంది. రోజుకు రెండు పూటలా అన్నం, పప్పు ఇస్తున్నారు. దానితోనే కడుపు నింపుకోవాల్సి వస్తోంది. పౌష్టికాహారం లభించక, మందులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న తెతియమ్ తన కడుపులో బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతోంది. ఇది ఒక్క తెరియమ్ కథే కాదు... ఏ సహాయ శిబిరంలో చూసినా ఆమె లాంటి వారు కన్పిస్తూనే ఉంటారు.
- కొండ ప్రాంతాలలో దుర్భర జీవనం
నిరాశ్రయులైన ప్రజల కోసం చుర్‌చాంద్‌పూర్‌లో 105 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. రేషన్, ఇతర ప్రభుత్వ సహాయాలు పొందేందుకు బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. శిబిరాలలో వారికి భోజనం మాత్రమే దొరుకుతోంది. శిబిరాలలో తల దాచుకుంటున్న కుకీలకు ఆహారం, ఇతర నిత్యావసరాలు రవాణా కాకుండా మైతీలు అడ్డంకులు సృష్టిస్తున్నారని భద్రతా సిబ్బంది తెలిపారు. భద్రతా సిబ్బంది కుకీలకు బాసటగా ఉంటున్నారని, తాము నిత్యావసరాల సరఫరాలను అడ్డుకుంటున్న విషయం నిజమేనని మైతీలు బాహాటంగానే చెబుతున్నారు. పలు ప్రాంతాలలో మే 3 నుంచే సమాచార వ్యవస్థ స్తంభించింది. ఇంఫాల్ నుంచి కొండ ప్రాంతాలకు సరకు రవాణాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ఎఫ్‌సిఐ వద్ద ఉన్న నిల్వలే దిక్కవుతున్నాయి. ఇంఫాల్ మీదుగా వెళ్లే సరకు రవాణా వాహనాలను మైతీలు అడ్డుకొని దోచుకుంటున్నారు. ఆ తర్వాత వాహనాలను తగలబెడుతున్నారు. దీనికితోడు కుకీల పట్ల అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు వారికి చాలినంత రేషన్ పంపడం లేదు. చిన్న పిల్లలకు అవసరమైన ఆహారం, మందులు, శానిటరీ వస్తువులు దొరకడం లేదు. ఇంఫాల్ నుండి గ్యాస్, ఇంధనం సరఫరా కాకుండా మైతీలు అడ్డుకుంటున్నారు. కుకీలు నివసించే ప్రాంతాలలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ సిలిండర్ రూ.2,500 పలుకుతోంది. పెట్రోల్‌ను చీకటి బజారులో విక్రయిస్తున్నారు. ఎటిఎంల వద్ద చాంతాడంత క్యూలు కన్పిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొండ ప్రాంతాలలో పరిపాలన అనేదే కన్పించడం లేదు. 'ఇక్కడ ప్రభుత్వమే లేదు. సౌకర్యాలూ లేవు. ఘర్షణలు మొదలైన తర్వాత ఒక్క బియ్యం గింజ కూడా రాలేదు. మేము ఆకలితో చనిపోవాలని మైతీలు కోరుకుంటున్నారు. రోజువారీ కూలి డబ్బులతో బతికే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చుట్టుపక్కల వారు సాయం చేస్తుంటే ఎలాగోలా ప్రాణాలు నిలుపుకుంటున్నారు' అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసు అధికారులు సైతం అవసరమైన పత్రాల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంఫాల్ నుంచి పత్రాలు తెప్పించుకునేందుకు మైనారిటీలను ఉపయోగించుకోవాల్సి వస్తోందని, మైతీలు వారిని చూస్తే పట్టుకొని ఆ పత్రాలను దగ్థం చేస్తున్నారని అధికారులు వాపోయారు.
- జీవనోపాధి కోసం...
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు జీవనోపాధి కోసం వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు. దినసరి వేతన కార్మికులు, చేనేత పనివారు పెట్రోల్ బంకుల ఎదుట కూర్చొని పెట్రోల్ నింపిన సీసాలు అమ్ముకుంటున్నారు. 750 మిల్లీలీటర్ల పెట్రోల్ సీసా రూ.120ా150 పలుకుతోంది. అదే సమయంలో మైతీల కోసం నడుపుతున్న సహాయ శిబిరాలలో వేటికీ కొరత లేదు. వారు నివసిస్తున్న ప్రాంతాలలో జనజీవనం మామూలుగానే సాగుతోంది.










