- 8 వారాలు అమల్లో ఉండేలా హైకోర్టు ఆదేశాలు
ప్రజాశక్తి-అమరావతి : మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ హోల్డర్ వివాదంపై సిఐడి నమోదు చేసిన కేసులో ఆ సంస్థ వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు, ఎమ్‌డి శైలజా కిరణ్‌పై ఎనిమిది వారాలపాటు కఠిన చర్యలు తీసుకోరాదని సిఐడికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ జస్టిస్ బివిఎల్‌ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చారు. మార్గదర్శి సహ వ్యవస్థాపకులు అయిన తన తండ్రి గాదిరెడ్డి జగన్నాథరెడ్డి (జిజె రెడ్డి)కి మార్గదర్శి చిట్‌ఫండ్‌లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకితో బెదిరించారని, తమ వాటాలను ఆయన కోడలు శైలజ పేరిట అక్రమంగా బదలాయించారని జగన్నాథరెడ్డి కొడుకు గాదిరెడ్డి యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి ఈ నెల 13న కేసు నమోదు చేసింది. దీనిని కొట్టేయాలని, తుది తీర్పు వెలువరించేలోగా సిఐడి దర్యాప్తుపై స్టే ఇవ్వాలని రామోజీ, శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను డిసెంబరు 6కు హైకోర్టు వాయిదా వేసింది.










