May 14,2023 12:31

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో ఎక్కువగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌, క్రైమ్‌ థ్రిల్లర్స్‌ వస్తున్నాయి. పైగా వీటికి ప్రత్యేకమైన ప్రేక్షకులూ ఉంటున్నారు. ఆ తరహాలో వచ్చిన చిత్రమే 'హీట్‌'. దర్శకుల నుంచి నటుల వరకూ అందరూ కొత్తగా పరిచయమైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులకు ఏ మేరకు చేరువైంది? వంటి విషయాలు తెలుసుకుందాం..!

కథలోకి వెళ్తే... అభిజిత్‌ (వర్దన్‌ గుర్రాల), సిరిల్‌ (మోహన్‌ సాయి) ఇద్దరూ చిన్నతనం నుంచి మిత్రులు. స్నేహితులు ఇద్దరూ కంపెనీ భాగస్వామ్యులుగానూ విజయవంతులవుతారు. ఈ క్రమంలో ఓ ప్రాజెక్ట్‌ విషయంలో స్టీఫెన్‌ అనే వ్యక్తితో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ క్రమంలో సిరిల్‌ తాను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి)ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కులంతార వివాహం కావడంతో ఆరాధ్య కుటుంబసభ్యులు రగిలిపోతారు. ఆరాధ్య అన్న రుద్ర ఎలాగైనా వారిని హతమార్చాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే సిరిల్‌, ఆరాధ్యలు కనిపించకుండా పోతారు. వారిని మాయం చేసింది ఎవరు? సిరిల్‌ను చావు కారణమెవ్వరు? ఫ్రెండ్‌ సిరిల్‌ కోసం అభి చేసిన ప్రయత్నాలేంటి? ఈ కథలో మైఖేల్‌ పాత్ర ఏంటి? చివరకు అభి తన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే మిగిలిన కథ.
ఈ చిత్రం కథ మొత్తం ఓ రాత్రిలో జరుగుతుంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మొదలై.. తెల్లారేసరికి కథ సుఖాంతం అవుతుంది. ఈ మధ్యలో ఏం జరిగిందనే దాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. మరీ అంత గ్రిప్పింగ్‌గా కాకపోయినా.. పర్వాలేదనిపించాడు. పాయింట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా తీసుకున్నారు. పాత కథల మాదిరిగానీ ట్విస్టులతోనే తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మైఖేల్‌ పాత్ర, అక్కడే మొదలయ్యే మెయిన్‌ పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథ, కథనం ఓకే అనిపిస్తుంది. అసలేం జరుగుతుందో అర్థం కానట్టు.. హత్యలు జరుగుతుండటం.. తర్వాత దాన్ని హీరో ఎలా ట్రాప్‌ చేసి పట్టుకున్నాడు.. అనే విషయాలను చక్కగా చూపించాడు దర్శకుడు. నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే బోర్‌ కొట్టిస్తుంది. అంతలోనే ఓ ట్విస్ట్‌ వచ్చి, కథ పరుగులు పెట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఆ మర్డర్లు చేసేది ఎవరనేది క్లియర్‌గా చూపించాడు. కానీ ఎందుకు చేస్తున్నారు? అనేది క్లారిటీ లేదు. ఆ క్యూరియాసిటీ సెకండాఫ్‌ మీద ఇంట్రెస్ట్‌ కలిగించేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు కూడా. కానీ క్లైమాక్స్‌కు ముందు ఓ రొటీన్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ వస్తుంది. దీంతో కథ నీరసంగా ముగుస్తుంది.
వర్దన్‌ గుర్రాల అభి పాత్రలో మెప్పిస్తాడు. ఎమోషన్స్‌ క్యారీ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ ఓకే అనిపిస్తాడు. సిరిల్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఆకట్టుకుంటాడు. మైఖేల్‌ తన విలనిజంతో ఆకట్టుకుంటాడు. హీరోయిన్లు ఎమోషనల్‌ కారెక్టర్లతో పర్వాలేదనిపిస్తారు. స్నేహా ఖుషి, అంబికా వాణిలు కనిపించినంత సేపూ ఆకట్టుకుంటారు. ఇక విలన్‌గా సైకో మైఖేల్‌ పాత్రధారి కూడా ఓకే అనిపిస్తాడు. ఇలా అన్ని పాత్రల్లో నటీనటులు తమ వంతు న్యాయం చేశారు. సినిమాలో పాటలు తక్కువే. ఇక ఆర్‌ఆర్‌ మాత్రం సినిమా ఆసాంతం వినిపిస్తూనే ఉంటుంది. సీన్లను బాగానే ఎలివేట్‌ చేస్తుంది. నైట్‌ విజన్‌ షాట్స్‌ బాగున్నాయి. కెమెరామెన్‌ పనితనం చూపించాడు. ఎడిటింగ్‌ ఓకే అనిపిస్తుంది.

movie



టైటిల్‌ : హీట్‌
నటీనటులు : వర్దన్‌ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్‌ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్‌, పుల్కిత్‌ తదితరులు
నిర్మాతలు : ఎం.ఆర్‌.వర్మ, సంజోష్‌
దర్శకత్వం : ఎం.ఎన్‌.అర్జున్‌, శరత్‌ వర్మ
సంగీతం : గౌతమ్‌ రవిరామ్‌
సినిమాటోగ్రఫీ : రోహిత్‌ బాచు