ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ పవర్ లూమ్‌లో చేనేత రకాలు తయారు చేయకుండా అరికట్టడంతోపాటు హ్యాండ్‌లూమ్‌ను పరిరక్షించాలని ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో అన్నివర్గాల ప్రజలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అలాంటి పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అలాంటి పరిశ్రమను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఆయా సమస్యలపై పరిష్కరించేందుకు ఈనెల 13న ధర్మవరంలోని సిరిపెడ్ కార్యాలయంలో చేనేత సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, హ్యాండ్లూమ్ అధికారులు హాజరవుతున్నారు. కావున చేనేత కార్మికులు భారీఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌హెచ్.బాషా, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
విలేఖరులతో మాట్లాడుతున్న ఎపి చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు










