Nov 02,2023 20:21

వివరాలు వెల్లడిస్తున్న డిఎస్‌పి

ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని మాచవరం రోడ్డులోని బిఆర్‌ పెట్రోల్‌ బంకు ఎదురుగా ఇటీవల జరిగిన డి వెంకటేశ్వర్లు (38)హత్య కేసును పోలీసులు ఛేదించారు.ఇటీవల కందుకూరు పట్టణం కేసరిగుంట కాలనీకి చెందిన వెంకటేశ్వర్లును గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టి చంపిన విషయం తెలిసిందే. హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని అనుమానాలు ఆనాడే వ్యక్తమయ్యాయి. అదే నిజమని పోలీసు విచారణలో తేలింది. గురువారం కందుకూరు డిఎస్‌పి రామచంద్ర విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ఉలవపాడు మండలం ధర్మారెడ్డి సంఘానికి చెందిన యానాది కులానికి చెందిన బాపట్ల సుబ్బారావు అనే వ్యక్తి వెంకటేశ్వర్లును గత నెల 28వ తేదీన రాత్రి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. బాపట్ల సుబ్బారావు అనే వ్యక్తి గతంలో కందుకూరు కేసరగుంట కాలనీలో వెంకటేశ్వర్లు ఇంటి పక్కనే నివాసమున్నారు. కందుకూరులో వెంకటేశ్వర్లు, సుబ్బారావు పక్కపక్కనే నివాసముంటున్న సందర్భంలో సుబ్బారావు భార్యతో వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గొడవలు జరిగాయి. ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సుబ్బారావు అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వెంకటేశ్వర్లుపై సుబ్బారావు కక్ష పెంచుకున్నాడు. అది మనసులో పెట్టుకొని సుబ్బారావు వెంకటేశ్వర్లును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పటికీ సుబ్బారావు, వెంకటేశ్వర్లు అప్పుడప్పుడు కలిసి మద్యం తాగుతూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీన రాత్రి సుబ్బారావు వెంకటేశ్వర్లుకు మాయమాటలు చెప్పి పామూరు బస్టాండ్‌లో మద్యం కొనుగోలు చేసి వెంకటేశ్వర్లు బైక్‌పై మాచవరం రోడ్డులోని బిఆర్‌ పెట్రోల్‌ బంకు ఎదురుగా సెల్‌ టవర్‌ దగ్గరలో ఉన్న పాత వైన్‌ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ గతంలో జరిగిన విహేతర సంబంధాల విషయమై మాటమాట పెరిగి ఘర్షణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు పక్కనే ఉన్న సిమెంటు దిమ్మెతో వెంకటేశ్వర్లు తలపై బలంగా కొట్టాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మతి చెందాడు. హత్య చేసింది సుబ్బారావు అయినప్పటికీ మరో కొంతమందిపై అనుమానంతో తాము విచారణ నిర్వహించామని, ఆ విచారణలో వారు కాదని తేలిందని డిఎస్‌పి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని తెలిపారు. కందుకూరు పట్టణంలో ఉన్న సీసీకేమారాల ఆధారంగా హత్య చేసింది సుబ్బారావు అనే అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా వివాహేతర సంబంధం నేపథ్యంలో తానే చంపినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. కేసును ఛేదించడంలో గుడ్లూరు సిఐ పి సుబ్బారావు, కందుకూరు సిఐఎస్కే నఫీజ్‌ భాష లను డిఎస్పి రామచంద్ర అభినందించారు.