ప్రజాశక్తి - దేవనకొండ
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటిందని, సరైన వర్షాలు కురవక వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మండల రైతులను ఆదుకునేందుకు హంద్రీ నీవా ద్వారా సాగునీటిని విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని తెర్నేకల్ సిపిఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నాయకులు సూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయి, సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ మాట్లాడారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అరకొర వర్షాల నేపథ్యంలో మండలంలో వేసిన పంటలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చాలా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గతంలో ఆగస్టు నెల మొదట్లోనే హంద్రీనీవా నీటిని విడుదల చేసే వారని తెలిపారు. ఈఏడాది ఆగస్టు 15 దాటినా నీటిని విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా హంద్రీనీవా నీటిని విడుదల చేసి పాణ్యం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనేక వనరులున్నా పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంత రైతులు నిత్యం కరువు, కాటకాలకు గురవుతున్నారని తెలిపారు. సిపిఎం మండల నాయకులు అశోక్, యూసుఫ్, మహబూబ్ బాషా, బజారి, శ్రీరాములు, లక్ష్మి రెడ్డి, సుధాకర్, లింగన్న పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గౌస్ దేశాయి










