ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్
రైస్ మిల్ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.నరసింహులు డిమాండ్ చేశారు. కర్నూలు న్యూ సిటీ హమాలీ కార్మికుల ఫెడరేషన్ కమిటీ ఆధ్వర్యంలో మారుతి రైస్ మిల్, రంగ పుల్లారెడ్డి రైస్ మిల్, ట్రిపుల్ కె రైస్ మిల్, యునైటెడ్ రైస్ మిల్ హమాలీ కార్మికులతో సంతకాల సేకరణ చేపట్టారు. రైస్ మిల్ యూనియన్ నగర కోశాధికారి ఎస్.ఉస్మాన్ బాష అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన నరసింహులు, న్యూ సిటీ రైస్‌మిల్ హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు సిహెచ్.సాయిబాబా మాట్లాడారు. హమాలీ కార్మికులు పగలనకా, రాత్రనకా మూటలు మోస్తూ, చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పని ప్రదేశంలో సరైన వసతుల్లేక, ఏదైనా ప్రమాదం జరిగినా, గాయాలపాలైనా, ప్రమాదవశాత్తు మరణించినా కార్మికుల కుటుంబాలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. రోజూ మూటలు మోసి, మోకాళ్లు, నడుము, మెడ దగ్గర ఎముకలు అరిగి 50 ఏళ్ల వయస్సు రాకముందే మూటలు మోయలేక, పని చేయలేక, అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. వయస్సు రాకముందే వృద్ధుల్లాగా ఇంటి దగ్గరే ఉండి కుటుంబానికి భారంగా మారిన పరిస్థితి ఉందని చెప్పారు. హమాలీ కార్మికుల సమస్యలను కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ గోడౌన్లను పనికి రాని గోడౌన్లుగా చేసి, ప్రయివేట్ గోడౌన్లకు అవకాశం కల్పించి, ప్రభుత్వ గోడౌన్లలో పని చేసే కార్మికులకు పని లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 44 లేబర్ కోడ్లను కుదించి 4 లేబర్ కోడ్లుగా చేసి యజమానులకు అనుకూలంగా చేయడం దారుణమన్నారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు హమాలీ కార్మికుల రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయిందని తెలిపారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈఎస్‌ఐ, పిఎఫ్, పెన్షన్, పని భద్రత, బీమా సౌకర్యం, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 44 లేబర్ కోడ్లను యథావిధిగా కొనసాగించాలని దశలవారీ పోరాటాలకు హమాలీ కార్మిక ఫెడరేషన్ పిలుపునిచ్చిందని తెలిపారు. హమాలీ కార్మికులతో సంతకాలు సేకరించి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, హమాలీ కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ పోరాటంలో రైస్ మిల్ హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైస్‌మిల్ హమాలీ కార్మికుల మేస్త్రీలు కె.శేఖర్, కె.సుంకన్న, కె.హనుమంతు, ఎర్రమల, మద్దిలేటి పాల్గొన్నారు.
మిల్లుల వద్ద సంతకాల సేకరణ చేపడుతున్న నాయకులు










