ప్రజాశక్తి-ఆదోనిరూరల్
హమాలీ కార్మికులకు సమగ్రమైన వేతన చట్టం తీసుకు రావాలని సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు జె.రామాంజనేయులు, బి.వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పెద్దతుంబలం గ్రామంలో హమాలీ కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షులు రామదాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హమాలీ కార్మికులు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. హమాలీ కార్మికులు వయస్సు ఉన్నప్పుడు కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వయస్సు మీద పడిన తర్వాత వృద్ధాప్యంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమగ్రమైన చట్టం తీసుకు రావాలని కోరారు. ప్రభుత్వం హమాలీ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే వారికి వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వయస్సు మీద పడిన తర్వాత వారికి కనీస పింఛను వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే వారికి సంక్షేమ బోర్డు అవసరమని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అల్లప్ప, నరసింహులు, నాగిరెడ్డి, గోవిందు, రామన్న పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










