Aug 15,2023 21:44

సాలూరులో జెండా ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు ఎన్‌వై నాయుడు

ప్రజాశక్తి - కొమరాడ : గిరిజనులకు, దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునే దిశగా భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐద్వా నాయకులు వి.ఇందిర పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొత్త దళిత వీధిలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరతో పాటు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూరి, స్థానిక నాయకులు గొర్లి గంగరాజు, విజయ మాస్టర్‌ మాట్లాడుతూ దళితులకు రిజర్వేషన్లు పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉందని అన్నారు. దళితులపైన దాడులు ఆపి వారికి రావాల్సిన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టాలని, వారికున్న చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. 77వ స్వాతంత్రం దినోత్సవం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో అలసింగి మోహన్‌రావు, గుత్తా వెళ్లి ముసలయ్య, మాజీ సర్పంచ్‌ కొత్తవిల్లి చిన్నయ్య, యూత్‌ సభ్యులు కొత్తవిల్లి సుధా, జొన్నాడ సురేష్‌, అలజంగి ప్రసాదరావు, సిల్లా రాజు, నిడగంటి రాము, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా మన్య ప్రాంతంలో గిరిజనులు అభివృద్ధికి నోచుకోక నేటికి దుర్భర జీవనం గడుపుతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ అన్నారు. స్థానిక ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం ఆవరణంలో జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ గిరిజనులకు స్వేచ్చ,Û స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేసి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించిన నాడే నిజమైన స్వాతంత్ర ఫలాలు అందుతాయని అన్నారు. ఐక్యంగా ఉంటూ గిరిజన హక్కులకై పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కోశాధికారి మండంగి రమణ, సిఐటియు మండల కార్యదర్శి కె గౌరీశ్వర రావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఎం సన్యాసిరావు, భీమారావు, బిడ్డిక సత్యం, కార్యకర్తలు, పాల్గొన్నారు.
బలిజిపేట : స్థానికప్రజా సంఘాల కార్యాలయంలో జాతీయ జెండా ఎపి రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ ఎగురవేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు రాజ్యాంగ పీఠిక చదివి ప్రమాణం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చి పేదల బతుకు నాశనం చేస్తున్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతు ఆత్మహత్యకు కారణమ య్యారన్నారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య గొడవ సృష్టించి మహిళలను నగంగా ఊరేగించే సాంస్కతికి మన భారతదేశం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున నిజమైన స్వాతంత్రం కోసం మరో పోరాటం జరగాలని, ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వంజరాపు సత్యం నాయుడు, నల్ల ఈశ్వరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి బలగ సత్యనారాయణ, బొద్దాన భానుమూర్తి, పీసా వెంకటస్వామి, గంట్యాడ బలరామునాయుడు, నారాయుడు, ప్రసాదు, కూర్మ పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌ : స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పెట్టుబడి దారులపైనా, వారికి కొమ్ముకాస్తున్న పాలకవర్గాల వారిపైనా పోరాటాలు కొనసాగి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌ వై నాయుడు పిలుపునిచ్చారు. మండలంలో మామిడిపల్లి మూడు రోడ్ల కూడలిలో ముంగరమ్మతల్లి ఆటో వర్కర్స్‌తో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ సంపదను పాలకులు వారికి అనుకూలంగా ఉండే కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, ఇటువంటి విధానాలపై ప్రజలంతా ఐకమత్యంతో పోరాడాలని, అప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఆటో కార్మికుడు జారజాపు శ్రీనుకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జరాజపు జ్యోతిష్యరావు, అప్పల రాజు, మహేష్‌, శ్రీను, రమేష్‌ అంగన్వాడీ నాయకులు నారాయణమ్మ, కుమారి పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రైతు ఉద్యమాలకు రైతులంతా ఏకమై రైతు సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధం కావాలని జిల్లా రైతు సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్‌ బంటు దాసు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఎస్‌ కె ఎం పిలుపు మేరకు మోడీ హటావో దేశ బచావో నినాదం పేరిట బంటువాని వలసలో జరిగిన సమావేశానికి రైతు సంఘం సమన్వయ కమిటీ సభ్యులు బుడితి అప్పలనాయుడు అధ్యక్షత వహించగా, సమన్వయ కమిటీ సభ్యులు కోరంగి మన్మధరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బంటు దాసు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు నష్టాన్ని కలిగించే నల్ల చట్టాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉంది తప్ప రైతాంగ సమస్యలు పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతులంతా ఏకమై స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీని గద్దె దింపి దేశాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు పి. సంఘం, రైతులు, పాల్గొన్నారు.